సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఎన్నో సేవాకార్యక్రమాలు చేపడుతుంటారు. అందులో భాగంగా చిన్నారుల గుండె సంబంధిత సమస్యలకు శస్త్రచికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటివరకు మహేష్ బాబు వెయ్యికి పైగా ఆపరేషన్స్ చేయించారు. అసలు మహేష్ ఇలా చిన్నపిల్లలకు సాయపడడం వెనుక అసలు కారణం ఏంటో తాజాగా చెప్పుకొచ్చారు.
నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోకి తాజాగా మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మహేష్ బాబు కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన ఆపరేషన్ చేయించిన ఓ పిల్లాడి ఫ్యామిలీను స్టేజ్ పైకి పిలిచారు బాలయ్య.
మహేష్ బాబుని చూసిన వారు ఎమోషనల్ అయ్యారు. తమ బిడ్డను కాపాడినందుకు మహేష్ కి కృతజ్ఞతలు చెప్పారు. అదే సమయంలో తనకు అసలు ఈ ఆలోచన ఎలా పుట్టిందో చెప్పుకొచ్చారు మహేష్. తన కొడుకు డెలివెరీ కంటే ఆరువారాల ముందే పుట్టేశాడని ఆ సమయంలో గౌతమ్ తన అరచేయంతే ఉండేవాడని.. ఇప్పుడు తన కొడుకు ఆరడుగులు ఉంటాడని అన్నారు.
ఆరోజు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఓకే.. మరిలేని వాళ్ల పరిస్థితి ఏంటి..? నావంతుగా చిన్నపిల్లలకు సాయం చేయాలనుకున్నానని.. అప్పటినుంచి అనారోగ్యంతో ఉన్న చిన్నపిల్లలకు ఆపరేషన్స్ చేయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మహేష్ బాబు చేపట్టిన ఈ సేవాకార్యక్రమంతో ఎందరో పిల్లలు ఈరోజు ఆనందంగా తిరుగుతున్నారు. ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలా జనాలకు సేవలు అందించడం నిజంగా అభినందించదగ్గ విషయం.