సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో న‌టుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మొదలుపెట్టి చాలా కాలమవుతున్నప్పటికీ.. కరోనా కారణంగా రిలీజ్ ఆగిపోయింది. మధ్యలో సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చిత్రబృందం ఆ వార్తలను కొట్టిపారేసింది.



2021, నవంబర్ 26న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన కొన్ని రోజులకు పరిస్థితుల దృష్ట్యా.. డిసెంబర్ 10న రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ టైంకి కూడా 'గుడ్ లక్ సఖి' రాలేదు. తాజాగా మరో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. 'సఖి వచ్చేస్తోంది' అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జనవరి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్ పాత్రలో కనిపించనుంది. ఓ పల్లెటూరి అమ్మాయి నేషనల్ లెవెల్ షూటర్ గా ఎలా ఎదిగిందనేదే సినిమా. 

 

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న 'గుడ్ లక్ సఖి' సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండ‌గా చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.