వైఎస్ఆర్ సీపీ తిరుగుబాటు ఎమ్మె్ల్యే రఘురామకృష్ణ రాజు, మరో ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. గురువారం మధ్యాహ్నం విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్‌తో మొదలైన ఈ ట్వీట్ల రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం సైతం ఇరువురూ ట్విటర్ వేదికగా పరస్ఫర విమర్శలు చేసుకున్నారు.
గురువారం (జనవరి 20) ఎంపీ విజయసాయి రెడ్డి.. రఘురామను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. ‘‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ప్రాపర్టీనో, వాహనాలనో అద్దెకు ఇచ్చినట్టు...నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్ మైక్ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్ మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!’’ అని ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన రఘురామకృష్ణ రాజు.. ‘‘ఆవునా? నా జీవితం నీకు ఏ1 కి భారంగా ఉందనే కదా నన్ను కూడా కడతేర్చాలనుకుంటున్నారు పాపం వివేకానంద రెడ్డి లా! ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది Mr. ఏ2!’’ అని బదులిచ్చారు.
మళ్లీ శుక్రవారం (జనవరి 21) మధ్యాహ్నం రఘురామ లక్ష్యంగా విజయసాయి రెడ్డి మరో రెండు ట్వీట్లు కాస్త ఎద్దేవా చేస్తూ.. ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరి మెప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ళకు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు. ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్ళే రాళ్లతో కొడతారు.’’
విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేసిన కాసేపటికే రఘురామ కౌంటర్ ట్వీట్ చేశారు. ‘‘నువ్వు నీ ప్రేమ బాణాలు విశాఖ నవ యువతుల మీద విసురుతున్నావు అంట కదా! పని చెయ్యకుండా ప్రజలను పీక్కుతింటున్న మిమ్మల్ని త్వరలో ఆ ప్రజలే రాళ్లతో కొడతారు. నువ్వు ఎన్ని ట్వీట్లు పెట్టినా ఏ1 నీకు రాజ్యసభ రెన్యువల్ చెయ్యడు అంట. ముందు నువ్వు ఏ1 చేతిలో తన్నులు తినకుండా ఉండేలా చూసుకో.’’ అని కౌంటర్ ఇచ్చారు.
దీనికి బదులుగా విజయసాయి మరో ట్వీట్ వదిలారు. ‘‘మా చిన్నప్పుడు అటు వెళ్లకండిరా బూచోడున్నాడు అని హెచ్చరించేవారు పెద్ద వాళ్లు. బూచోడంటే మతిస్థిమితం లేనివాడని, రాళ్లు విసురుతాడని భయపడేవాళ్లం. ఇప్పుడు రాజా వారిని కూడా అందరూ అలాగే అనుకుంటున్నారు. పరువు తీస్తున్నాడని బంధువులు, కుటుంబ సభ్యులు బయటకు రావడం లేదట. ఏం ఖర్మ!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై రఘురామ ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య