బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి ఇందులో కీలకపాత్రల్లో నటించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మేకర్స్ పై, నటి అలియాపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 


గంగూబాయి కుమారుడు, ఆమె మనవరాలు ఇప్పటికే ఈ సినిమాపై కోర్టులో కేసు పెట్టారు. తన తల్లి సెక్స్ వర్కర్ కాదని.. స్త్రీల అభివృద్ధి కోసం కృషి చేసిన ఆమెని తప్పుగా చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సినిమా తీయడానికి తమ పర్మిషన్ కూడా తీసుకోలేదని వాపోయారు. ఈ సినిమాపై స్టే ఇవ్వమని అతడు కోరగా.. కోర్టు అతడి పిటిషన్ ని కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు అతడితో పాటు కామాఠిపుర ప్రజలు కూడా ఈ సినిమాపై తిరగబడుతున్నారు. 


ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత కామాఠిపుర ప్రతిష్ట దెబ్బతిందని, ఆ ప్రాంతం మొత్తాన్ని రెడ్ లైట్ ఏరియాగా భావిస్తున్నారని.. ఇది తమకు పెద్ద అవమానమని దాదాపు యాభై మంది స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా కలిసి కేసు రిజిస్టర్ చేశారు. అలానే కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ పటేల్‌తో పాటు పునరుజ్జీవన్ సేవా మండల్, అఖిల పద్మశాలి సమాజ్, గుజరాతీ ట్రస్ట్, తిరంగ్ హౌసింగ్‌ సొసైటీ లాంటి పలు సామాజిక సేవా సంస్థలు కూడా ఈ సినిమాకి వ్యతిరేకంగా కేసులు పెట్టారు. 


ఈ కేసులన్నీ కోర్టులో ఉన్నాయి. ఈ కేసులపై స్పందించిన సుప్రీం కోర్టు బుధవారం నాడు 'గంగూబాయి కతియావాడి' సినిమా టైటిల్ మార్చమని దర్శకనిర్మాతలకు చెప్పింది. రేపు కోర్టులో ఈ కేసుకి సంబంధించిన వాదనలను వినిపించనున్నారు. పిటిషనర్ తరఫున అరుణ్ కుమార్ సిన్హా, రాకేష్ సింగ్ కేసుని వాదించనున్నారు. భన్సాలీ ప్రొడక్షన్ తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ దవే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. 


సినిమా రిలీజ్ కి మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో మేకర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే భన్సాలీకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. ఆయన సినిమాలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటాయి. ఆ తరువాతే థియేటర్లలో విడుదలవుతాయి. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి!