టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హైదరబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి తరలించారు. తర్వాత చికిత్స కు శరీరం సహకరించకపోవడం, అవయవాలు పనిచేయకపోవడంతో ఇవాళ తెల్లవారుఝామున 4.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవలే కృష్ణ భార్య ఇందిరా కన్నుమూశారు. అంతకుముందు పెద్ద కొడుకు రమేష్ మరణించారు. ఇప్పుడు కృష్ణ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ మరణ వార్తతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు: రజనీ కాంత్
కృష్ణ మృతి పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటని అన్నారు. కృష్ణ తో కలసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రజనీ, కృష్ణ తో కలసి మూడు సినిమాల్లో నటించారు. 1978 లో 'అన్నదమ్ముల సవాల్', 1979లో 'ఇద్దరూ అసాధ్యులే', 1980 లో 'రామ్ రాబర్ట్ రహీం' సినిమాల్లో కృష్ణ తో కలసి రజనీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
మాటలకు అందని విషాదం : మెగాస్టార్ చిరంజీవి
కృష్ణ మరణ వార్త విని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు. ‘‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకొంటున్నా’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
ఆయనతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది : నందమూరి బాలకృష్ణ.
కృష్ణ మరణం పట్ల నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ''ఘట్టమనేని కృష్ణ మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఆయాన తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఆయనతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ లేనిలోటు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను." అని అన్నారు.