బరువు తగ్గాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ కొన్ని సార్లు వాళ్ళు తీసుకునే పరిమిత ఆహారం కూడా బరువు పెంచుతుందనే విషయం త్వరగా గ్రహించలేరు. డైట్ ప్లాన్ లో భాగంగా కేలరీలు తక్కువ ఉండే పదార్థాలు ఎంచుకుంటారు. అది చాలా వరకి మంచి విషయమే కానీ ఈ మూడు పదార్థాలు మాత్రం మీ డైట్లో ఉంటే బరువు తగ్గడం అనేది కాస్త కష్టమే. అవేంటో తెలుసా తెల్లని పదార్థాలు.
తెల్ల ఆహారంలో ఎక్కువ భాగం సాధారణ చక్కెరలని కలిగి ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలని త్వరగా పెంచేస్తాయి. పోషక విలువలు ఉండవు, కేలరీలు ఇవ్వలేని ఆహారం. తెల్లని పదార్థాలు, పిండి పదార్థాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలకి దూరంగా ఉండాలి. తప్పనిసరిగా తెల్లగా ఉండే అన్ని భోజన వంటకాలకి దూరంగా ఉండాలి. అప్పుడే మీరు చేరాలనుకున్న బరువు తగ్గే లక్ష్యాలని చేరుకోగలుగుతారు. ఇన్సులిన్ స్థాయిలు వేగంగా పెరగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పడిపోతాయి. కొద్దిసేపటికే ఆకలిగా అనిపిస్తుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారాల కోరికని పెంచుతుంది. బరువుని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే మూడు తెల్లటి పదార్థాలు విస్మరించాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
వైట్ షుగర్: ప్రాసెస్ చేసిన చక్కెరని వీలైనంత వరకు నివారించాలి. ఎందుకంటే ఈ చక్కెర అవయవాలని లావుగా మారుస్తుంది. గుండె జబ్బులకి దారి తీస్తుంది. అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుతుంది. ఆకలి, సంతృప్త హార్మోన్లని అసమతుల్యం చేస్తుంది. ప్రాసెస్ చేసిన చక్కెరకి బదులుగా బ్రౌన్ షుగర్ కి మారొచ్చు.
తెల్ల పిండి(మైదా): బయట దొరికే చిరుతిండ్లు తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థం తెల్ల పిండి(మైదా). దీన్ని అధికంగా తీసుకుంటే అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే మైదా పిండి స్థానంలో ఆరోగ్యకరమైన గోధుమ పిండి లేదా ఇతర మిల్లెట్లతో తయారు చేసిన ఆహార పదార్థాలు తయారు చేసుకుని తినొచ్చు. గోధుమ పిండి కాకుండా జొన్నలు, రాగులు, సజ్జలతో చేసిన రొట్టెలు చేసుకుని తింటే ఆరోగ్యానికి పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయి. వీటితో చేసిన రొట్టెలు కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి అందులో కాస్త గోధుమ పిండి జోడించి తయారు చేసుకోవచ్చు. ఇవి రుచికరంగా మాత్రమే కాదు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మైదా పిండి చవకగా ఉండటం వల్ల బయట పదార్థాలు తయారు చేసేందుకు దీన్ని అధికంగా వినియోగిస్తారు. ఇది అతిగా తింటే అజీర్ణం, మలబద్ధకం, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
బేకింగ్ సోడా: రసాయనికంగా దీన్ని సోడియం బైకార్బోనెట్ అని కూడా పిలుస్తారు. ఆహార పదార్థాలు మెత్తగా చేయడానికి బేకింగ్ లో దీన్ని ఉపయోగిస్తారు. ఎక్కువగా బేకింగ్ సోడాని పిజ్జా, బ్రెడ్, బేకరీ ఐటెమ్స్, పులియబెట్టిన ఆహారంలో ఉపయోగిస్తారు. ఈ ఆహారాలు అన్ని జీర్ణక్రియని కష్టతరం చేస్తాయి. కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. క్రమం తప్పకుండా దీన్ని ఉపయోగించడం వల్ల లావుగా కూడా మారిపోతారు.
బరువు తగ్గాలని అనుకుంటే చక్కగా తృణధాన్యాలు, తాజా కూరగాయలు, పండ్లు ఎంపిక చేసుకోవాలి. వీటితో పాటు శారీరక శ్రమ, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం కూడా ముఖ్యమే అనే విషయం గుర్తుంచుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పచ్చిమిర్చి వల్ల బరువు తగ్గడమే కాదు మరెన్నో ప్రయోజనాలున్నాయ్