జానకిని ఎలాగైనా ఒప్పించి కేసు విత్ డ్రా చేసుకోమని లాయర్ రామాకి చెప్తాడు. ఇంట్లో అందరూ అఖిల్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అఖిల్ కి బెయిల్ వస్తుందో రాదో అని జ్ఞానంబ కంగారుపడుతుంది. అటు మల్లిక జెస్సి పేరెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు ఇంటికి వస్తారు. జెస్సీ వాళ్ళని చూసి మరింత ఏడుస్తుంది. అల్లుడు గారు ఏ సమస్య లేకుండా బయటకి వస్తారనే నమ్మకం మాకుందని తల్లి జెస్సీకి ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. అల్లుడుగారు నిర్దోషిగా బయటకి వస్తారు మీకు అండగా మేముంటాం అని పీటర్ జ్ఞానంబకి భరోసా ఇస్తారు. అప్పుడే రామా, విష్ణు ఇంటికి వస్తారు. బెయిల్ వస్తుందా లాయర్ ఏం చెప్పారు అని గోవిందరాజులు అడుగుతారు.


 జానకిగారు కేసు వెనక్కి తీసుకుంటే తప్ప బెయిల్ కి అవకాశం లేదని లాయర్ చెప్పాడని రామా ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. ఎప్పుడు ఇంటికి కుటుంబం, పరువు గురించి ఆలోచించే నువ్వు మరిది మీద ఎందుకు కేసు పెట్టావో అర్థం కావడం లేదు ఒక్కసారి ఆలోచించమని పీటర్ జానకిని అడుగుతాడు. నీ మరిది భవిష్యత్, అత్తగారి గౌరవం గురించి ఆలోచించి కేసు వెనక్కి తీసుకోమని జెస్సి తల్లి మేరీ కూడా అడుగుతుంది. జెస్సీని ఇంటికి తీసుకెళ్తామని పీటర్ అడుగుతాడు. ఈ టైమ్ లో తను ఇక్కడే ఉండాలి, అత్తయ్యగారికి సపోర్ట్ గా ఉండాలి, తను రాలేను అని జెస్సి చెప్తుంది. మల్లిక వేసిన ప్లాన్ బెడిసికొట్టినందుకు తెగ ఫీల్ అయిపోతుంది.


Also Read: 'సామ్రాట్ నీ అదృష్టం అమ్మా' వదులుకోవద్దని చెప్పిన ప్రేమ్- నందులో పశ్చాత్తాపం?


రామా: జెస్సి ఆలోచించెంత బాధ్యతగా మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, మీ నిర్ణయం అందరినీ బాధపెడుతుంది, అఖిల్, జెస్సి భవిష్యత్, ఈ కుటుంబం పరువు మీ చేతుల్లోనే ఉందని జానకికి చెప్పి వెళ్ళిపోతాడు.  


తన వ్యక్తిత్వం తెలిసి కూడా ఎందుకు అందరూ తనని తప్పు పడుతున్నారని జానకి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. జెస్సీ మైండ్ చెడగొట్టాలని మల్లిక డిసైడ్ అవుతుంది. అటు జ్ఞానంబ అఖిల్ అన్న మాటలు తలుచుకుని ఏడుస్తుంది. ‘నా పెంపకం అంత పెద్ద తప్పు చేయదు అనే నమ్మకం ఒక పక్కన, నా పెద్ద కోడలు ఇంటి పరువు పోయేలా చేయదు అనే భావన ఇంకో పక్కన ఎటూ తేల్చుకోలేక మనసుని వేధిస్తున్నాయి. జానకి తన నిర్ణయం మీద మొండిపట్టుదలతో ఉంది, రామా ఎన్ని చెప్పినా వినడం లేదు. కడుపుతో ఉన్న ఆడపిల్ల భర్త కోసం బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నా. జానకి మీద నా మనసులో పడిన ముద్ర వల్లో ఏమో కానీ నేను కోడలితో గట్టిగా మాట్లాడలేకపోతున్నా. ఇటేమో అఖిల్ కేసు కోర్టుకి వెళ్తే ఏమవుతుందో అర్థం కావడం’ లేదని జ్ఞానంబ బాధపడుతుంది.


Also Read: వెక్కి వెక్కి ఏడుస్తున్న వేద- తాగి రచ్చ చేసిన యష్, సంబరంలో ఖైలాష్


జెస్సి ఒంటరిగా కూర్చుని బాధపడుతుంటే మల్లిక వస్తుంది. ‘అమాయకుడైన అఖిల్ మీద మన ఇంట్లో మనిషే కేసు పెట్టడం ఏంటో, నీ కన్నీళ్ళు చూస్తుంటే గుండె చెరువైపోతుంది, తను నీ బాధపట్టించుకోకుండా అఖిల్ మీద కేసు పెట్టింది. కేసు కోర్టుకి వెళ్ళి జానకి సాక్ష్యం చెప్తే అఖిల్ కి ఉరిశిక్ష పడే అవకాశం ఉందని ఊర్లో వాళ్ళు చెవులు కోరుక్కుంటున్నారు’ అని మల్లిక జెస్సితో అంటుంది. ఆ మాటలు రామా కూడా వింటాడు. ‘ఉరిశిక్ష తప్పినా కానీ జీవితఖైదు అయినా పడొచ్చని అంటున్నారు, అదే నిజం అయితే 14 ఏళ్లు అఖిల్ జైల్లోనే ఉండాలి, అదే జరిగితే నీకు పుట్టిన బిడ్డ నాన్న ఎవరు అని అడిగితే ఏం చెప్తావ్ చెప్పు’ అని మల్లిక నోటికి వచ్చినట్టు వాగి పెట్రోల్ పోస్తుంది.