ప్రధానమంత్రి మోదీతో పవన్ సమావేశమైన తర్వాత వైసీపీ లీడర్లు తెగ భయపడిపోతున్నారని ఎద్దేవా చేశారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు. వైసీపీ మంత్రులు ఎందుకు ఇంతలా హైరానాపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. సోమవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసిన నాగబాబు ప్రభుత్వం, వైసీపీ లీడర్లపై తీవ్ర విమర్శలు చేశారు. 


పరిజ్ఞానం లేని వైసీపీ లీడర్లు, మంత్రులకు వచ్చినట్టుగానే అందరికీ స్క్రిప్టులు వస్తుంటాయన్న భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు నాగబాబు. జనసేన నాయకుడు మాట్లాడిన ప్రతి మాట వారే అవగాహనతో మాట్లాడతారని స్పష్టం చేశారు. 


వైసీపీ అధికారం చేపట్టే నాటి నుంచి చేసిన అవినీతిపై లెక్కలతో తేలుస్తామన్నారు నాగబాబు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వారి లెక్కలు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగనన్నకాలనీల పేరుతో జే గ్యాంగ్‌ మొత్తం 15, 191 కోట్లు దోచుకుందని ఆరోపించారు. 


ఇళ్ల స్థలాలకు గ్రావెల్‌ ఐదు కిలోమీటర్ల పరిధిలో నుంచి తరలించాలనే నిబంధనను సవరించి దోచుకున్నారని ఆరోపించారు నాగబాబు. అడుగడుగునా రూల్స్ బ్రేక్ చేస్తున్నారని వివరించారు. పొక్లైన్లు, ట్రాక్టర్లు వినియోగించకూడదని  రూల్స్ చెబుతున్నా... వాటినే ఉపయోగించి స్థలాలను చదును చేస్తున్నారన్నారు.  


కనీసం జగనన్న కాలనీలకు ఇసుకను కూడా సరఫరా చేయలేకపోతున్నారని... దాని నుంచి కూడా దోచుకుంటున్నారని ఆరోపించారు. టన్ను 675 రూపాయలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. భారతీ సిమెంట్స్‌కు లబ్ధి చేయడానికి మిగిలిన సిమెంట్‌ కంపెనీలతో కుమ్మక్కయ్యారని.. ధరలు పెంచేశారని విమర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని పేర్కొన్నారు.