సూపర్ స్టార్ ఫ్యామిలీకి 2022 అస్సలు మర్చిపోలేని సంవత్సరం. ఒకే కుటుంబంలో ముగ్గురు ఈ సంవత్సరమే మరణించారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే జనవరి 8వ తేదీన వారి ఇంట్లో మొదటి విషాదం చోటు చేసుకుంది. కృష్ణ పెద్దకొడుకు, మహేష్ బాబుకు అన్నయ్య అయిన రమేష్ బాబు లివర్ సంబంధిత సమస్యలతో మరణించారు.


వయో సంబంధిత వ్యాధితో కృష్ణ భార్య ఇందిరా దేవి సెప్టెంబర్ 28వ తేదీన మరణించారు. ఈవిడ మరణం కృష్ణను మరింత కుంగదీసింది. ఇప్పుడు కృష్ణ కూడా మరణించడంతో ఒకే సంవత్సరం కుటుంబంలో ఉన్న ముగ్గురు పెద్దవాళ్లు దూరం అయినట్లు అయింది. ఈ బాధ నుంచి కోలుకోవడానికి మహేష్ బాబుకి, ఆయన కుటుంబానికి చాలా కాలమే పడుతుంది.


1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరాలకు మొదటి సంతానంగా జన్మించారు రమేష్ బాబు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో బాల నటుడిగా పరిచయం అయ్యారు. కృష్ణ నటించిన పలు సినిమాల్లో బాల నటుడి పాత్రలను రమేష్ బాబు పోషించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సామ్రాట్’తో రమేష్ బాబు హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత అపజయాలు ఎదురుకావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయారు. 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో ‘ఎన్‌కౌంటర్’ చిత్రంలో రమేష్ బాబు చివరిగా కనిపించారు.


అయితే హీరోగా కెరీర్ ముగిశాక కృష్ణ ప్రొడక్షన్స్ హౌస్ స్థాపించి మహేష్ బాబు హీరోగా ‘అర్జున్’, ‘అతిథి’ చిత్రాలను తెరకెక్కించాడు. అంతేకాకుండా ‘దూకుడు’, ‘ఆగడు’ చిత్రాలకు సమర్పకుడిగా కూడా వ్యవహరించారు.


ఇక ఇందిరా దేవి సూపర్ స్టార్ కృష్ణకు స్వయానా మేనమామ కూతురు. చలనచిత్ర రంగంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రమేష్ బాబు, మహేష్ బాబు కొడుకులు కాగా, ప్రియదర్శిని ఘట్టమనేని (సుధీర్ బాబు భార్య), మంజుల ఘట్టమనేని, పద్మావతి ఘట్టమనేని కూతుర్లు.


అనంతరం కృష్ణ కొన్ని సినిమాల్లో విజయ నిర్మలతో కలిసి పని చేశారు. ఈ సమయంలో వారిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఇందిరా దేవి అనుమతితోనే కృష్ణ, విజయ నిర్మలను పెళ్లాడారు. విజయ నిర్మల కూడా 2019లో మరణించారు. అనంతరం ఇందిరా దేవి 2022లో వయస్సుకు సంబంధించిన సమస్యలతో మరణించారు.