తెలుగు చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ఇకలేరు. ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. 


తొలుత గుండెపోటు...
తర్వాత ఆర్గాన్స్ ఫెయిల్యూర్!
Krishna Death Reason : కృష్ణకు ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆయనను హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. వయసు రీత్యా ప్రతి మనిషి ఆరోగ్యంలో కొన్ని మార్పులు రావడం సహజమే. కృష్ణకూ ఆ విధమైన సమస్యలు కొన్ని ఉన్నాయి. అందువల్ల, అభిమానులు ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు.
 
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటికీ... ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో కృష్ణ హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా మారింది. వెంటిలేటర్ సహాయంతో ఆయనకు చికిత్స అందించారు. కాంటినెంటల్ ఆస్పత్రిలో అంతర్జాతీయ సదుపాయాలతో ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ... ప్రయోజనం దక్కలేదు. కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.


శోకసంద్రంలో
ఘట్టమనేని కుటుంబం
కుటుంబానికి పెద్ద దిక్కు మరణించడంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 
ఈ ఏడాది జనవరిలో కృష్ణ కుమారుడు రమేష్ బాబు, సెప్టెంబర్ నెలాఖరున కృష్ణ సతీమణి ఇందిరా దేవి మరణించారు. ఇప్పుడు కృష్ణ కన్ను మూశారు. ఒక్క ఏడాదిలో తమకు ఎంతో ఆప్తులైన ముగ్గురు లోకాన్ని విడిచి వెళ్ళడం... మూడు విషాదాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు (Mahesh Babu), ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదని తెలుస్తోంది.


అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవ దేహాన్ని నేడు ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణ మరణంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కృష్ణ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.  


కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసినప్పటి నుంచి రెండు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు హైదరాబాద్‌కు ప్రయాణం అయ్యారు. నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అభిమానులు కాంటినెంటల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కృష్ణ కోలుకోవాలని ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు.ఇప్పుడు వారందరూ అభిమాన కథానాయకుడిని కడసారి చూడాలని కోరుకుంటున్నారు. 


Also Read : కృష్ణ ఇక లేరు - ఆయన బాల్యం, ఇండస్ట్రీలోకి రాకముందు జీవితం గురించి తెలుసా?


హెల్త్ విషయంలో అప్‌డేట్స్ ఇచ్చిన నరేష్!
కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులతో పాటు నటుడు వీకే నరేష్ కూడా కృష్ణ హెల్త్ విషయంలో ఎప్పటికప్పుడు అభిమానులకు అప్‌డేట్స్ ఇస్తూ వచ్చారు. 48 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని ఆయన వెల్లడించారు. వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ...  శ్వాస తీసుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని సోమవారం తెలిపారు. ''నాన్నగారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండే వ్యక్తి. ఆయనకు ఎటువంటి ఆయనకు అనారోగ్య సమస్యలు లేవు. రియల్ లైఫ్‌లోనూ, రీల్ లైఫ్‌లోనూ డేరింగ్ డ్యాషింగ్ పర్సన్. ఆయన ఎన్నో పోరాటాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ప్రాణాల కోసం ఫైట్ చేస్తున్నారు. త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. మీ అందరి ప్రార్థనలు కృష్ణ గారిని కాపాడుతాయి'' అని సోమవారం సంధ్య వేళలో నరేష్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ సూపర్ స్టార్ తిరిగి రాని లోకాలకు వెళ్లారు.