తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు (Super Star Krishna Is No More). ఈ రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్‌గా సుపరిచితులైన కృష్ణ బాల్యం గురించి, ఇండస్ట్రీకి 'తేనెమనసులు' చిత్రంతో కథానాయకుడిగా పరిచయం కాకముందు జరిగిన సంఘటనల గురించి మీకు తెలుసా? 


కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణ మూర్తి (Ghattamaneni Siva Rama Krishna Murthy). గుంటూరు జిల్లాలోని తెనాలికి సమీపంలోని బుర్రిపాలెం ఆయన సొంతూరు. తెనాలిలోని డాక్టర్ సుందరరామయ్య ఆస్పత్రిలో 1943, మే 31న మధ్యాహ్నం 12.05 గంటలకు జన్మించారు.


కృష్ణ తండ్రి పేరు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి. తల్లి పేరు నాగరత్నమ్మ. కృష్ణ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం. అందరిలో కృష్ణ పెద్దవారు. నిర్మాతలు హనుమంతరావు, ఆదిశేషగిరి రావు ఆయనకు స్వయానా తమ్ముళ్లు. 
ఆయన బాల్యమంతా ఎక్కువగా తెనాలిలో గడిచింది. కృష్ణ తండ్రి వ్యవసాయంతో పాటు కలప వ్యాపారం చేసేవారు. తమది మధ్యతరగతి కుటుంబమని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. 


పదో తరగతి వరకు తెనాలిలోనే కృష్ణ చదువుకున్నారు. ఆయన్ను ఇంజనీర్‌గా చూడాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. అందుకని, ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని చదివారు. గుంటూరులో ఇంజనీరింగ్ సీటు లభిచకపోవడంతో నర్సాపూర్‌ కాలేజీలో చేరారు. అక్కడ మూడు నెలలు చదివాక టిసి తీసుకొని ఏలూరులోని సిఆర్‌ రెడ్డి కాలేజీలో జాయినై బీఎస్సీ పూర్తి చేశారు.


తండ్రి ప్రోత్సాహంతో సినిమాల్లోకి!
తల్లిదండ్రులు ఇంజనీర్ చేయాలనుకున్నా.... సీటు రాకపోవడంతో కృష్ణ పెద్దగా బాధపడలేదు. పైగా, ఆనందపడ్డారు. ఎందుకంటే... బీఎస్సీలో చేరే సమయానికి మనసు సినిమాల వైపు మళ్ళింది. కుమారుడిని ఏం చేయాలని తండ్రి తీవ్రంగా ఆలోచిస్తుంటే.... ఆయన దగ్గరకు వెళ్లిన కృష్ణ తన మనసులో మాట చెప్పారు. 'సరే నీ ఇష్టం' అంటూ కుమారుడిని రాఘవయ్య చౌదరి ప్రోత్సహించారు. అంతే కాదు... తెనాలిలో తనతో పాటు కలిసి  మెలిసి తిరిగిన మిత్రుడు, వాహిని స్టూడియోస్ అధినేత చక్రపాణికి కుమారుడి గురించి లేఖ రాశారు. తన స్నేహితుడు రాజగోపాల వెంకటరత్నం చేత ఆయన అల్లుడు ఆనంద్ బాబుకు లేఖ రాయించారు. ఆ ఆనంద్ బాబు ఎవరో కాదు... ప్రముఖ దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ కుమారుడు. తండ్రి ఇచ్చిన రెండు లేఖలతో కృష్ణ మద్రాసులో అడుగుపెట్టారు.


Also Read : ఏలూరు ఎంపీ సూపర్ స్టార్ కృష్ణ - రాజకీయాల్లోనూ స్టారే !


హీరోగా అవకాశాల కోసం కృష్ణ ఇండస్ట్రీలో అడుగుపెట్టే సమయానికి ఆయన వయసు 19 ఏళ్ళు. చక్రపాణి, ఆనంద్ బాబులను కలిశారు. కృష్ణను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు చక్రపాణి. ఆయన కూడా వయసుకు తగ్గ పాత్రలు లేవని చెప్పారు. అయితే... నటనలో అనుభవం కోసం నాటకాల్లో వేషాలు వేయమని కృష్ణకు ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. ఆనంద్ బాబు ద్వారా ఎల్వీ ప్రసాద్‌ను కలిసిన కృష్ణకు అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. సేమ్ సలహా వచ్చింది. మరీ యంగ్ అని, నాటకాల్లో అనుభవం సంపాదించుకుంటే మంచిదని చెప్పారు.


శోభన్ బాబు హీరో...
కృష్ణ సెకండ్ హీరో!
తెనాలికి చెందిన నాటక రచయిత కొడాలి గోపాలరావు పరిచయంతో కృష్ణ రంగ ప్రవేశం జరిగింది. 'చేసిన పాపం కాశీకి వెళ్ళినా!?' నాటకంలో రెండో హీరోగా రంగ ప్రవేశం చేశారు. అందులో శోభన్ బాబు ఫస్ట్ హీరో. అప్పటికి ఆయనకు నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత 'ఛైర్మన్' నాటకంలో హీరోగా చేశారు కృష్ణ. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు.


'తేనెమనసులు' కంటే ముందు...
కృష్ణ వెండితెరకు పరిచయమైన సినిమా 'తేనెమనసులు'. అయితే... ఆయనకు హీరోగా ముందు అవకాశం వచ్చింది అందులో కాదు! ఎల్వీ ప్రసాద్ 'కొడుకులు - కోడళ్ళు' అని ఓ సినిమా ప్రారంభించారు. అందులోని నలుగురు హీరోల్లో ఒకరిగా కృష్ణను ఎంపిక చేశారు. నలుగురిలో ఒకరు కావడంతో అయిష్టంగా కృష్ణ ఓకే అన్నారు. నెల రోజులు రిహార్సిల్స్ చేశాక సినిమా ఆగింది. ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 'తేనెమనసులు' సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా వంద రోజులు ఆడింది. ఆ తర్వాత కృష్ణ వెండితెర ప్రయాణం దిగ్విజయంగా కొనసాగింది. తెలుగు చిత్రసీమలో తనకంటూ కొన్ని పేజీలను ఆయన లిఖించుకున్నారు. అది ప్రేక్షకులకు తెలిసిందే.


పెళ్లి తర్వాత హీరోగా...
'తేనెమనసులు' షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి కృష్ణకు వివాహమైంది. ఓ  బిడ్డకు తండ్రి అయ్యారు. ఇందిరా దేవిని నవంబర్‌ 20, 1962లో ఆయన పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆయన ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. హీరో కాలేదు. పెద్ద కుమారుడు రమేష్ బాబు జన్మించిన తర్వాత కృష్ణకు హీరోగా తొలి అవకాశం వచ్చింది. 


Also Read : టాలీవుడ్‌లో పెను విషాదం - సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు - దివికి ఎగసిన మరో తార


కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు కుమారులు. కృష్ణ రెండో కుమారుడు మహేష్ బాబు ఈతరం సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. పెద్ద కుమార్తె పద్మావతిని గల్లా జయదేవ్‌కు ఇచ్చి వివాహం చేశారు. రెండో అమ్మాయి మంజుల నటిగా, నిర్మాతగా ప్రేక్షకులకు తెలుసు. మూడో అమ్మాయి ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్నారు.


'సాక్షి' సినిమాతో తనకు పరిచయమైన కథానాయిక విజయనిర్మలను కృష్ణ మార్చి 24, 1969న తిరుపతిలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.