సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. సినీ సంగీతానికి ఆయన చేసిన కృషి మరువలేనిది. 1966లో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయన, పలు భాషల్లో వేలాది పాటలు పాడారు. తన అద్భుతమైన గాత్రంతో సంగీత ప్రియులను ఎంతగానో అలరించారు. గాయకుడిగానే కాదు, నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు. సుస్వరాల బాలు తన మైస్మరైజింగ్ వాయిస్ తో గిన్నీస్ బుక్ తో తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు. బాలు 1946, జూన్ 4 న నెల్లూరులోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. మధుర గాయకుడి 81వ జయంతి ఇవాళ. ఈ సందర్భంగా ఆయనకు సినీ సంగీత ప్రియులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయన అద్భుత పాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

  


ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంజినీరింగ్‌ చదవాలనే కోరికతో అనంతపురంలోని జేఎన్‌టీయూలో చేరారు. కానీ, కొద్ది రోజుల్లోనే ఇంజినీరింగ్ చదువకు స్వస్తి పలికారు. అదే సమయంలో చెన్నై ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్‌ లో చేరారు. అక్కడ పలు సంగీత పోటీలలో పాల్గొన్నారు. ఒకరోజు జరిగిన సంగీత కార్యక్రమంలో కోదండపాణి న్యాయనిర్ణేతగా వెళ్లారు. అక్కడ ఎస్పీ బాలసుబ్రమణ్యం తన గాత్రంతో అందరినీ అబ్బురపరిచి విజేతగా నిలిచారు. అప్పుడు కోదండపాణి, బాల సుబ్రమణ్యాన్ని తన శిష్యుడిగా చేసుకున్నారు.


గిన్నిస్ వరల్డ్ రికార్డ్


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎన్నో వేల పాటలు పాడారు. తన జీవితకాలంలో అత్యధిక పాటలు పాడిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించాడు. సంవత్సరానికి సగటున 930 పాటలు, రోజుకు దాదాపు 3 పాటలతో తన జీవిత కాలంగా 40 వేలకు పైగా పాటలు పాడారు. ఇది ప్రపంచంలోని ఏ గాయకుడికీ సాధ్యం కాని రికార్డ్. అలాగే, SPB అనేక ప్రైవేట్ ఆల్బమ్‌ కోసం పాటలు పాడారు.


12 గంటల్లో 21 పాటలు


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక రోజులో అత్యధిక పాటలు పాడిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. కన్నడ స్వరకర్త ఉపేంద్ర కుమార్ కోసం 12 గంటల్లో 21 పాటలను రికార్డ్ చేశారు. ఒక రోజులో 19 తమిళ పాటలు, హిందీలో ఒక రోజులో 16 పాటలను రికార్డ్ చేశాడు. 'కెళది కన్మణి' చిత్రం కోసం 'మన్నిల్ ఇంత' అనే పాటలో ఊపిరి తీసుకోకుండా పాడిన పాటలు అందరినీ అలరించాయి.


నటుడిగా, సంగీత దర్శకుడిగా


పాటలు పాడటమే కాకుండా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమాల్లో సహాయక పాత్రలు పోషించారు. ఆయన దాదాపు 72 సినిమాల్లో నటించారు. అన్ని దక్షిణ భారతీయ భాషలను అనర్గళంగా మాట్లాడగలగడం ఆయన సొంతం. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోని చిత్రాలలో నటించాడు. అలాగే తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 46 చిత్రాలకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.


ఆరుసార్లు జాతీయ అవార్డు గ్రహీత


ఆరు జాతీయ అవార్డులను గెలుచుకున్న అరుదైన గాయకులలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. నాలుగు విభిన్న భారతీయ భాషలలో ఆయన ఈ అవార్డులను అందుకున్నారు. తెలుగులో మూడుసార్లు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఒక్కోసారి అవార్డును అందుకున్నారు. తమిళంలో, 'మిన్‌సార కనవు' చిత్రంలో 'తంగ తామరై' పాటను అద్భుతంగా అందించినందుకు గాను ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం జాతీయ అవార్డును పొందారు. సెప్టెంబర్ 25, 2020 నాడు అనారోగ్యంతో   చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు.


Read Also: మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ