Coromandel Express Accident:


పట్టాలు తప్పిన ఘటనలు..


రైలు పట్టాలు తప్పి పడిపోతే ప్రాణనష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఒడిశా ఘటనతో మరోసారి రుజువైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 288 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. ఇప్పటికీ ఇందుకు కారణమేంటన్నది తెలియలేదు. అయితే...గతంలోనే రైలు ప్రమాదాలపై CAG ఓ రిపోర్ట్ విడుదల చేసింది. ఆర్నెల్ల క్రితమే ఇది వెలుగులోకి వచ్చింది. పట్టాలు తప్పడం వల్ల ఎన్ని ఘోరాలు జరిగాయో వివరించింది. 2017 ఏప్రిల్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో 16 రైల్వే జోన్‌లలో దాదాపు 1129 పట్టాలు తప్పిన ఘటనలు జరిగాయని గతేడాది డిసెంబర్‌లో వెలువరించిన ఈ నివేదికలో  వెల్లడించింది. అంటే నాలుగేళ్లలో ఏడాదికి 282 డీరైల్‌మెంట్ (derailments) ఘటనలు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల కారణంగా రైల్వేకి రూ.32 కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. వీటితో పాటు మరి కొన్ని వివరాలూ వెల్లడించింది ఈ నివేదిక. 


రిపోర్ట్‌లో ఏముంది..? 


పట్టాలు తప్పడానికి గల 24 కారణాలను ఈ నివేదికలో వెల్లడించింది CAG.ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల 422 ప్రమాదాలు జరిగినట్టు తేల్చి చెప్పింది. ఇక 171 కేసులలో ట్రాక్ మెయింటెనెన్స్ లేకపోవడం ప్రమాదాలకు దారి తీసింది. ప్రమాణాలకు అనుగుణంగా పట్టాలు తయారు చేయకపోవడం వల్ల 156 ప్రమాదాలు జరిగాయి. మెకానికల్ డిపార్ట్‌మెంట్ వల్ల కూడా ఘోర విషాదాలు చూడాల్సి వచ్చింది. దాదాపు 182 సంఘటనలు జరిగాయి. కోచ్‌లలో లోపాలతో పాటు రైల్ చక్రాల డయామీటర్‌ ప్రమాణాలకు తగిన విధంగా లేకపోవడమూ ప్రాణనష్టానికి దారి తీసింది. 37% ప్రమాదాలు ఇలా జరిగినవే. ఇక లోకోపైలట్‌ తప్పిదాల వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. 275 ప్రమాదాలు కేవలం ఆపరేటింగ్ డిపార్ట్‌మెంట్ నిర్లక్ష్యం వల్ల తలెత్తాయని కాగ్‌ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇన్ని ప్రమాదాలు సంభవించినా...వీటిలో దాదాపు 49% కేసులలో సరైన రిపోర్ట్ కూడా తయారు చేయలేకపోయారు అధికారులు. ట్రాక్ రెన్యువల్ వర్క్స్‌కి సంబంధించి కేటాయించే నిధులు కూడా తగ్గిపోవడం వల్ల ప్రమాదాలు సంభవించినట్టు వెల్లడించింది కాగ్ రిపోర్ట్. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడం లాంటి తప్పిదాలూ భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఆపరేషన్ సమస్యలే 19% మేర నమోదైనట్టు నివేదిక తెలిపింది. 


రైల్ ఫ్రాక్చర్..


ట్రాక్ ఫెయిల్యూర్ కారణంగానే రైళ్లు పట్టాలు తప్పుతాయి. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే...Rail Fracture.దీంతో పాటు వెల్డ్ ఫెయిల్యూర్ (Weld Failure) కూడా రైలు ప్రమాదానికి కారణమవుతోంది. రైల్ ఫ్రాక్చర్ అంటే...పట్టాలు డ్యామేజ్ అవడం. సాధారణంగా రైలు పట్టాలని స్ట్రాంగ్ స్టీల్‌తో తయారు చేస్తారు. ఎంత బరువునైనా తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాదు. టెంపరేచర్‌ ఎక్కువైతే పట్టాలు వేడెక్కుతాయి. ఎక్స్‌పాండ్ అవుతాయి. ఇదే ప్రమాదాలకు కారణమవుతుంది. అయితే...రైలు పట్టాలు తప్పడానికి ఇదొక్కటే కారణం కాకపోవచ్చు. తయారు చేసినప్పటి నుంచి వాటిని ఇన్‌స్టాల్ చేసే వరకూ...చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఎక్కడ చిన్న లోపం తలెత్తినా...అది భారీ ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇక మెయింటెనెన్స్ లేకపోవటమూ మరో కారణం. అవే పట్టాలను ఏళ్ల పాటు వాడడం వల్ల అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలున్నాయి. 


Also Read: Odisha Train Accident: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో రైలు ప్రమాదాల్ని నియంత్రించొచ్చా? అదెలా సాధ్యం?