Odisha Train Accident: 



సుప్రీంకోర్టులో పిటిషన్ 


ఒడిశా రైలు ప్రమాదంపై నిపుణులతో కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతే కాదు. దేశవ్యాప్తంగా అన్ని రూట్‌లలోనూ కవచ్‌ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల ప్రాణాలను రక్షించాలని ఇందులో ప్రస్తావించారు. విశాల్ తివారి అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ వేశారు. Automatic Train Protection System కవచ్‌ని తక్షణమే అమలు చేసే విధంగా కేంద్రానికి మార్గదర్శకాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. నిపుణుల కమిటీతో విచారణ జరిపించాలని సుప్రీకోర్టుని విజ్ఞప్తి చేశారు. కవచ్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వాదన ఇప్పటికే వినిపిస్తోంది. ప్రతిపక్షాలు ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నాయి. ఈ రూట్‌లో కవచ్ ఎందుకు లేదు అని ప్రశ్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశం సుప్రీంకోర్టుకి చేరుకోవడం కీలకంగా మారింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.