బెస్ట్ మూవీ కేటగిరీలో ’సీతారామం’ సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు


మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ’సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వచ్చిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. ఆర్మీ ఆపరేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమ కథ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. వై జయంతి మూవీస్ బ్యానర్ మీద సి.అశ్విని దత్త్ రూ.30 కోట్లతో ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లింది. దుల్కర్‌ సల్మాన్, మృణాల్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మైమరచిపోయారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసింది.విమర్శకుల ప్రశంసలు పొందిన  ‘సీతారామం’ చిత్రానికి అరుదైన అవార్డు లభించింది. 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో జ్యూరీ క్యాటగిరిలో బెస్ట్ మూవీగా అవార్డుని అందుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 






బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో ‘బలగం’ చిత్రానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు


ఇక ఇదే అవార్డుల వేడుకలో ‘బలగం’ సినిమా సైతం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుంది. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.  చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని అందుకున్నది ‘బలగం’. మార్చి 3న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఓటీటీలోనూ అలరిస్తోంది.  పెద్ద సినిమాలకు దీటుగా ఈ చిత్రం వసూళ్లను రాబట్టింది. టాలీవుడ్ నటుడు, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ రూపొందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన ఈ చిత్రం మంచి ప్రజాదరణ దక్కించుకుంది. ఈ మూవీపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. 






ఇప్పటికే బలగంచిత్రానికి  ప్రతిష్టాత్మక అవార్డులు


ఇప్పటికే ‘బలగం’ చిత్రం అంతర్జాతీయ అవార్డుల వేడుకలో సత్తా చాటింది.  ప్రతిష్టాత్మక లాస్ ఏంజిల్స్ అవార్డు వేడుకలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది.  






Read Also: హీరో అజీత్ అస్సలు సెల్‌ఫోనే వాడరట - ఆయనతో మాట్లాడాలంటే ఏం చేయాలో తెలుసా?