తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దివంగత సూపర్ స్టార్ కృష్ణ. టాలీవుడ్ లో ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. తెలుగు సినిమాలకు సరికొత్త టెక్నాలజీ హంగులు తీసుకొచ్చిచ్చారు. తొలిసారి తెలుగు తెరకు కౌబాయ్ చిత్రాన్ని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. సుమారు 5 దశాబ్దాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మే 31న ‘మోసగాళ్లకు మోసగాడు’ రీరిలీజ్
తెలుగునాట ఓ ప్రత్యేక సంతరించుకున్న 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం రీరిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నెల 31న ఆయన జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 4K టెక్నాలజీతో ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు నిర్మాత ఆది శేషగిరిరావు. ''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా. మా బ్యానర్ లో ఎన్ని సినిమాలు తెరకెక్కాయి. చాలా సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంత అద్భుత విజయాలు అందుకున్నా, ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి జయంతికి నివాళిగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నాం” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.
63 దేశాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం ఇది
‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం ఐదు దశాబ్దాల క్రితమే తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. అప్పట్లోనే ఈ సినిమా ఏకంగా 63 దేశాల్లో విడుదలైంది. అంతకు ముందు భారతీయ సినీ పరిశ్రమలో ఏ హీరోకు సంబంధించిన చిత్రం అన్ని దేశాల్లో విడుదల కాలేదు. కృష్ణ సినీ కెరీర్ తో పాటు దేశ సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించింది. ఈ కౌబాయ్ సినిమాను ‘మేకనస్ గోల్డ్’ అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా రూపొందించారు. వసూళ్ల పరంగా ఈ సినిమా అద్భుతాలు చేసింది. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే జానపద, పౌరాణిక చిత్రాలు ఉండేవి. ఒక్కసారిగా హాలీవుడ్ రేంజి సినిమాను చూపించారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాను వెండి తెరపై చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు.
ఇక ఈ సినిమాను అప్పట్లో రూ. 8 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించారు. కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందుగా 35 సెంటర్లలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమాను హిందీతో పాటు తమిళ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశారు. అక్కడ కూడా కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా 63 దేశాలలో ఈ చిత్రం విడుదలై సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
Read Also: ఖరీదైన బ్యాగ్‌తో కనిపించిన మహేష్ బాబు, దాని ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవ్వాల్సిందే!