టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత(Samantha). వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. 


ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఆయనే ఓ నిర్ణయం తీసుకుంటారని దర్శకుడు గుణశేఖర్ చూస్తున్నారు. కొన్నాళ్లక్రితం ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ తొలివారం లేదా నవంబర్ ఆఖరి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


సంక్రాంతికి దిల్ రాజు నిర్మిస్తోన్న 'వారసుడు' సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి అప్పుడు 'శాకుంతలం' సినిమాను రిలీజ్ చేయలేరు. అదే డిసెంబర్ తొలివారంలో అయితే బెటర్ అని దిల్ రాజు భావిస్తున్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ధనుష్ 'సార్', నాని నిర్మిస్తోన్న 'హిట్ 2' సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలకు ముందుగానీ, వెనుక గానీ 'శాకుంతలం' రిలీజ్ డేట్ ఉంటుందని అంటున్నారు. ఈ వారంలో సమంత అమెరికా నుంచి రిటర్న్ కానుంది. ఆమె రాగానే ఒక మాట చెప్పి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. 


ఇక ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నీలిమ గుణ రీసెంట్ గా మాట్లాడుతూ.. తమ సినిమా ఈ ఏడాదే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది తప్ప అంతకుమించి సినిమా గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. దీంతో సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గుణశేఖర్ ను ట్యాగ్ చేస్తూ సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది. 'శాకుంతలం' భారీ గ్రాఫిక్స్ తో ముడిపడ్డ సినిమా అని.. అందుకోసం చాలా సమయం, శ్రమ, అవసరం పడుతున్నాయని.. అందుకే ఈ ఆలస్యం అని చెబుతున్నారు గుణశేఖర్. ఆడియన్స్ కి మంచి సినిమా అందించాలనేది తమ తాపత్రయమని, అంతవరకు వేచి చూడాలని ఆయన కోరారు. 


ఇందులో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న 'శాకుంతలం' చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 


Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 



Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!