Trending
NIA ED Raids: దేశవ్యాప్తంగా NIA సోదాలు, 106 మందిని అరెస్ట్ చేసిన అధికారులు
NIA ED Raids: దేశవ్యాప్తంగా NIA సోదాలు కొనసాగుతున్నాయి. యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో భాగంగా 106 మందిని అరెస్ట్ చేశారు.
NIA ED Raids:
ఢిల్లీ PFI ప్రెసిడెంట్ అరెస్ట్
దేశవ్యాప్తంగా NIA సోదాలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా NIAతో పాటు ED సోదాలు నిర్వహించింది. మొత్తం 11 రాష్ట్రాల్లోని PFI (Popular Front of India)ఆఫీసుల్లో రెయిడ్స్ చేశారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 106 మందిని అరెస్ట్ చేశారు. ఈ 106 మందిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. కేరళలో 22 మంది, మహారాష్ట్ర, కర్ణాటకలో 20 మంది, ఆంధ్రప్రదేశ్ ఐదుగురు, అసోంలో 9 మంది, ఢిల్లీలో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పుదుచ్చేరిలో ముగ్గురు, తమిళనాడులో 10 మంది, యూపీలో 8 మందితో పాటు రాజస్థాన్‌లో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మరో కీలక విషయం ఏంటంటే..ఢిల్లీ PFI ప్రెసిడెంట్ పర్వేజ్‌నూ అరెస్ట్ చేశారు NIA అధికారులు. తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. పర్వేజ్‌తో పాటు ఆయన సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. పర్వేజ్‌కు PFIతో ఎంతో కాలంగా అనుబంధం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా...అత్యంత పకడ్బందీగా భారీ సోదాలు చేపట్టాయి NIA,ED.ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న వారి ఇళ్లలో ఈ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. కొందరు ఉగ్రవాదులకు ట్రైనింగ్ క్యాంప్‌లూ నిర్వహించారు. ఇంకొందరు యువకులను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని NIA అధికారులు చెబుతున్నారు.
నోరు నొక్కేస్తున్నారు: PFI
దేశవ్యాప్తంగా ఉన్న PFI ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయని Popular Front of India ప్రకటించింది. PFI కమిటీ ఆఫీస్‌ల్లోనూ ఇవి కొనసాగుతు న్నాయని వెల్లడించింది. అయితే..ఈ సోదాల పట్ల PFI అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫాసిస్ట్ పాలన అంటూ విమర్శలు చేసింది. నోరు నొక్కేయడానికే ఇలా సోదాలు నిర్వహిస్తున్నారంటూ మండి పడింది. యాంటీ సిటిజన్‌షిప్ యాక్ట్ విషయంలో జరిగిన అల్లర్లకు PFIకి సంబంధం ఉందని NIA అనుమానిస్తోంది.