బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తి చేసిన ఆరోపణలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల కేతన్ కక్కడ్ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన సల్మాన్ ఖాన్ పై పలు ఆరోపణలు చేశారు. ముంబై సిటీ పన్వేల్ ప్రాంతంలోకి సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని.. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా ఉన్నాయని సదరు వ్యక్తి ఆరోపించాడు.
దీంతో సల్మాన్ ఖాన్ అతడిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై ముంబై కోర్టులో సల్మాన్ తరఫు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపించారు. సల్మాన్ ఖాన్ కు చెందిన పన్వేల్ ఫాంహౌస్‌లో సినీ తరాల శవాలను పాతిపెడుతున్నారంటూ.. కేతన్ కక్కడ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు.. ఇవన్నీ కేవలం కల్పితాలని సల్మాన్ న్యాయవాది కోర్టుకి వినిపించారు.
ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో కావాలనే సల్మాన్ ఖాన్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేతన్ కక్కడ్ ప్రయత్నిస్తున్నారని కోర్టుకి తెలిపారు. సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా కేసులో గూగుల్, యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ పేర్లను కూడా పేర్కొన్నారు. ఈ సామాజిక మాధ్యమాలు కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ ఖాన్ తరఫు న్యాయవాది కోర్టుని కోరారు.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ ఈ ఫాంహౌస్‌లో తన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నారు. తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి పార్టీ కూడా ఇచ్చారు. తనకు సమయం దొరికినప్పుడల్లా.. ఫాంహౌస్‌లోనే గడుపుతుంటారు సల్మాన్. అలాంటి ఈ ఫాంహౌస్ కి సంబంధించి సల్మాన్ ఖాన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది.