మోడల్ గా కెరీర్ ఆరంభించిన శ్రీలీల ఇటీవల 'పెళ్లి సందడి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌరీ రోనంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటించడం విశేషం. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించాడు. దసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.
కొన్ని థియేటర్లలో ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్, నటన, డాన్స్ లు ఆకట్టుకోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి. ముందుగా రవితేజ నటిస్తోన్న 'ధమాకా' సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. అలానే దిల్ రాజు అన్నయ్య కుమారుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా 'సెల్ఫిష్'లో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కాశీ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు శ్రీలీలకు మరో రెండు సినిమాల ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ శ్రీలీలతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి, వైష్ణవ్ తేజ్ హీరోలుగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. నవీన్ హీరోగా నటిస్తోన్న 'అనగనగా ఒకరాజు' సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించనుంది. అలానే వైష్ణవ్ తేజ్ సరసన కూడా నటించబోతుంది. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించనున్నారు. మొత్తానికి ఈ యంగ్ హీరోయిన్ పేరున్న ప్రాజెక్ట్ లలో అవకాశాలు కొట్టేస్తుంది.