Online Tickets For Srisailam Temple: ఏపీలో కరోనా వైరస్ కేసులు గత వారంతో పోల్చితే రెట్టింపు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం పలు శాఖలకు, దేవాలయాలకు సూచనలు ఇచ్చింది. శ్రీశైలంలో ఆన్ లైన్ టికెట్ ఉంటేనే స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామని శ్రీశైలం దేవస్థానంఈఓ లవన్న తెలిపారు. కరోనా నిబంధనల కారణంగా దేవాదాయశాఖ ఆదేశాలతో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకోవాలంటే ఇక నుంచి ఆన్ లైన్ బుకింగ్ టికెట్ తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ ఆలయ క్యూలైన్ల నుంచి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న భక్తులకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు దర్శనం వేళల్లో సామాజిక దూరం (Social Distancing) పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు అందరు సహకరించాలని ఈఓ కోరారు.
ఆన్ లైన్ టికెట్ ఉంటేనే దర్శనం..
సోమవారం నుంచి ఆన్ లైన్ టికెట్ ఉంటేనే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని ఈఓ లవన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశాలతో ఆన్ లైన్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శంచుకునేందుకు భక్తులు ఆన్ లైన్ టికెట్ తో శ్రీశైలం రావాలని ఆన్ లైన్ టికెట్ లేకుండా శ్రీశైలం వచ్చి ఇబ్బందులు పడవద్దని భక్తులకు ఈఓ విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం ఆలయంలో యాగాలు హోమాలు స్వామి అమ్మవార్ల దర్శనం టికెట్లు అన్నీ కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచామని వివరించారు.
ఒక్కరోజులో 12 వేలకు పైగా కేసులు
ఏపీలో కరోనా వైరస్ కేసులు ఏపీలో రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 43,763 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 12,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వైరస్ బారి నుంచి.. మరో 3,913 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం.. 73 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.