విక్టరీ వెంకటేష్.. అంటే యావత్ టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. కుర్ర హీరోలతో సైతం కలిసి చక్కని సినిమాలు చేశారు. చాలా ఏళ్ల తర్వాత మన వెంకీ మామ బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు.  సల్మాన్ ఖాన్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నారు.


1993లో అనారి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన వెంకీ.. ఆ తర్వాత తక్‌దీర్‌ వాలా (1995) అనే మరో హిందీ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో బిజీ స్టార్‌గా మారిపోవడం వల్ల బాలీవుడ్ వైపు చూడలేదు. సుమారు 28 ఏళ్ల తర్వాత సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కిసి కా భాయ్ కిసి కా జాన్’ సినిమాతో మరో మారు బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ చిత్రానికి తొలుత  ‘కభీ ఈద్ కభీ దివాళి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ‘భాయిజాన్’ అనే పేరు పెట్టాలి అనుకున్నారు. ఈ రెండు కాదని.. తాజాగా ‘కిసి కా భాయ్, కిసి కా జాన్’ అనే పేరును ఖరారు చేశారు.


ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న‘కిసి కా భాయ్ కిసి కా జాన్’  సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పూజ అన్న పాత్రలో వెంకటేష్  కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి వెంకటేష్ కు, సల్మాన్ కు మంచి దోస్తీ ఉంది. అందుకే సల్మాన్ తన సినిమాలో నటించాలని కోరడంతో వెంకీ వెంటనే ఓకే చెప్పారట. ఇదే సినిమాలో మరో కీ రోల్ జగపతి బాబు చేస్తున్నారట.   


ఈ సినిమా నుంచి దర్శకుడు ఫర్హాద్‌ సమ్జీ తప్పుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే కరోనా వ్యాపించింది. దీంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అయితే తొలి షెడ్యూల్ అవుట్ ఫుట్ చూసి.. సల్మాన్‌ నచ్చలేదని చెప్పారట. మళ్లీ రీషూట్ చేద్దామన్నారట. దర్శకుడు అవమానంగా ఫీలై.. వెంటనే సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆయన వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఈ సినిమా బాధ్యతలను సల్మాన్ ఖాన్ చూసుకుంటున్నారట. ఈ సినిమాని దర్శకుడి సహాయం లేకుండా తానే డైరెక్ట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాడట.  


మరోవైపు యంగ్ హీరోలతో కలిసి విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు . వరుస విజయాలను అందుకుంటున్నారు. సోలో హీరోగానూ సరికొత్త స్టోరీలను ఎంచుకుంటున్నారు. సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు. తాజాగా  వరుణ్ తేజ్ తో కలిపి ఎఫ్ 3 సినిమా చేశారు. మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అటు సోలోగా దృశ్యం-2లో నటించి మెప్పించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ఓ వెబ్ సిరీస్ లో కూడా వెంకటేష్ నటిస్తున్నారు.