రెజీనా కసాండ్ర (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'శాకిని డాకిని' (Shakini Dakini Movie). సెప్టెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ హీరోయిన్లు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఇప్పటికే సినిమాలో సాంగ్స్, టీజర్ ను రిలీజ్ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను వదిలారు.
ఇందులో రెజీనా, నివేదా ట్రైనింగ్ తీసుకునే పోలీస్ ఆఫీసర్స్ పాత్రల్లో కనిపించారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులను ఎదురుకొన్నారనేదే సినిమా. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. సినిమా కూడా ప్రామిసింగ్ గా ఉంటే కచ్చితంగా హిట్ కొట్టడం ఖాయం.
ఈ సినిమా 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ సినిమాకు రీమేక్. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కొరియన్ సినిమాలో ఇద్దరు యువకులు ప్రధాన పాత్రలు పోషించారు. అదే సినిమాను తెలుగులోకి వచ్చేసరికి ఇద్దరు అమ్మాయిలతో ప్లాన్ చేశాడు దర్శకుడు. ఉమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కించారు. ఈ సందర్భంగా కథలో చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
సస్పెన్స్ థిల్లర్ గా కొనసాగే ఈ సినిమాను దగ్గుబాటి సురేశ్ బాబు, సునీత తాటి కలిసి నిర్మిస్తున్నారు. ఓ బేబి సినిమా తర్వాత వీరిద్దరి నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. తొలుత ఈ సినిమా విడుదలపై సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జనాలు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడటం కంటే ఓటీటీల్లోనే ఎక్కువగా సినిమాలు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కానీ, చివరకు ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థలు సిద్ధం కావడం విశేషం.
అటు తన తాజా మూవీ వకీల్ సాబ్ తో నివేదా థామస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. మెస్మరైజింగ్ యాక్టింగ్ తో అదరగొట్టింది ఈ ముద్దుగుమ్మ. శాకిని-డాకిని సినిమాతో మరోసారి జనాలను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం నివేద థామస్ తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. అటు రెజీనా మాత్రం శాకిని-డాకిని మీదే ఆశలు పెట్టుకుంది.
వినోదంతో పాటు మంచి సందేశం ఉంది : రెజీనా
'శాకిని డాకిని' సినిమాలో యాక్షన్, కామెడీతో పాటు మంచి వినోదం ఉందని రెజీనా కాసాండ్రా తెలిపారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశామన్నారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ ''ఈ సినిమాలో 'కదిలే కదిలే' పాట వింటే నాకు గూస్ బంప్స్ నాకు తెలిసి... చాలా మంది జిమ్ సాంగ్ అవుతుంది. నాకు ముందు నుంచి యాక్షన్ చేయడం అంటే ఇష్టం. ఈ సినిమాతో యాక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది. దాని కోసం ముందుగా ప్రిపేర్ అవ్వడం, వర్క్ షాప్స్ చేయడం కొత్తగా అనిపించింది'' అని చెప్పారు.
రెజీనాతో కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తోంది : నివేదా థామస్
'శాకిని డాకిని' ప్రచార చిత్రాల్లో రెజీనాతో తన కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ లభిస్తోందని నివేదా థామస్ తెలిపారు. కథ విన్నప్పుడు, కథా చర్చల్లో పాల్గొన్నప్పుడు సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు కలిగిందని ఆవిడ అన్నారు. ఇంకా నివేదా థామస్ మాట్లాడుతూ ''తెలుగులో చేస్తున్నామని తెలిశాక 'మిడ్ నైట్ రన్నర్స్' చూశా. నేను శాలిని రోల్ చేశా. నిజ జీవితంలో కూడా నా పాత్ర అలాగే ఉంటుంది. పెద్దగా కష్టపడటం అవసరం లేదనిపించింది. తెలంగాణ యాస నేర్చుకుని చేశా. యాక్షన్ సీన్స్ చేయడం ఛాలెంజ్. వాటి కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాం. యాక్షన్ నేపథ్యంలో ఇటువంటి సినిమాలు మరిన్ని చేయాలని ఉంది'' అని అన్నారు.