దొండకాయ, బెండకాయ, క్యారెట్ ఇలా పచ్చి కూరగాయాలను చాలా మంది తింటూనే ఉంటారు. పచ్చి కూరగాయాలను తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిని సలాడ్ రూపంలో లేదా జ్యూస్ చేసుకుని తాగడం వల్ల శరీరం ఫిట్ గా ఉంటుంది. అనేక వ్యాధులను కూడా దూరం చెయ్యడంలో సహాయపడుతుంది. పచ్చి కూరగాయల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. వాటిని వండుకుని తినే క్రమంలో అందులోని పోషకాలు కొన్ని నశించిపోతాయి. వీటిలో ఉండే మినరల్స్, విటమిన్స్ రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయని నిపుణులు కూడా చెప్తారు.


వాస్తవానికి పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వాటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఏదైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యాన్ని ఇచ్చినట్టే అమితంగా తీసుకునే హాని కూడా చేస్తాయి అనే విషయం ఇందులోని వర్తిస్తుంది. పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని కలుగుతుందని ఆయుర్వేదం చెప్తోంది. పచ్చి ఆహారాన్ని అధికంగా తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.


వండిన ఆహరం కంటే పచ్చి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం శరీరానికి కష్టంగా మారుతుంది. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కొన్ని ముడి ఆహార పదార్థాల్లో యాంటీ న్యూటియంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి ఇవి పోషక శోషణని పూర్తిగా అడ్డుకుంటాయి. అందుకే వాటిని ఉడికించిన తర్వాత తీసుకోవమని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.


ఈ లక్షణాలు కనిపిస్తే తినొద్దు  


వికారం, మైకం, అలసట, పొట్ట ఉబ్బరం. అతిసారం వంటి లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే పచ్చి కూరగాయాలు తినడం ఆపేయండి. ఈ సంకేతాలు కనిపిస్తే అవి మీ శరీరానికి సరిగా లేవని అర్థం చేసుకోవాలి. వాటిని మితంగా మాత్రమే తీసుకోమని హెచ్చరిస్తున్నట్టు అర్థం. పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే అవి పరాన్నజీవులకి ఆవాసంగా మారతాయి. ఇవి కేవలం కడగటం ద్వారా పోవు. అందుకే వాటిని ఉడకబెట్టిన తర్వాత తీసుకుంటే మేలు.


ఇలా తినాలి


ఆకుపచ్చ కూరగాయలు తేలికగా ఉడికిపోతాయి. వాటితో కొద్దిగా సుగంధ ద్రవ్యాలు వేసి ఉడికించుకోవాలి. కాయధాన్యాలు, సూప్ లు, తృణధాన్యాలు లేదా ఇతర కూరగాయాలతో ఆకు పచ్చ కూరగాయలని కలిపి ఉడికించుకోవాలి. కూరగాయలను అల్యూమినియం, రాగి పాత్రలో వండకూడదు.


ఈ పచ్చి కూరగాయలు తినొద్దు


బచ్చలికూర, కాలీఫ్లవర్ వంటివి పచ్చివి తినకపోవడమే మంచిది. వీటిలో ఆక్సలెట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్ళని ఏర్పడేలా చేస్తాయి. పెద్ద మొత్తంలో వీటిని తినడం వల్ల ఐరన్, కాల్షియం శోషణని తగ్గిస్తుంది. పచ్చి కాలేలో థైరాయిడ్ గ్రంధి పనితీరును ప్రభావితం చేసే గోయిట్రోజెన్‌లు ఉంటాయి.


వీటిని దూరంగా ఉంచాలి


క్యాబేజీ, బ్రకోలి వంటి పచ్చి కూరగాయలు థైరాయిడ్ పని తీరుకు ఆటంకం కలిగిస్తాయి. కాలిఫ్లవర్‌ను పచ్చిగా తీసుకోవడం వల్ల కొంతమందిలో కడుపు ఉబ్బరం సమస్య తలెత్తుతుంది. 


ఏ కూరగాయలు జ్యూస్ చేసుకోవచ్చు


క్యారెట్, దోసకాయలు, సెలెరీ, గోధుమ గడ్డి, అల్లం, కొత్తిమీర వంటి వాటిని జ్యూస్ చేసుకుని తాగొచ్చు. పొట్ట ఉబ్బరం, తేన్పులు రావడం వంటి సమస్య నుంచి బయట పడేందుకు ఈ జ్యూస్ లో కొద్దిగా ఉప్పును జోడించడం మాత్రం మరచిపోవద్దు. అదే విధంగా అతిగా మాత్రం వాటిని తీసుకోకూడదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also read: అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ప్రపంచం మెచ్చిన పాలకులు ఇష్టంగా తాగే పానీయాలు ఇవే


Also read: అతనికి పదిహేను మంది భార్యలు, వందమందికి పైగా పిల్లలు, వీడియో చూడండి