సినీ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలను మొయినాబాద్ సమీపంలోని కనకమామిడిలో ఉన్న ఫామ్ హౌస్ లో నిర్వహించబోతున్నారు. అయితే కృష్ణంరాజుకి కొడుకులు లేకపోవడంతో అంత్యక్రియలు ఎవరు చేస్తారనే విషయంపై చర్చ నడిచింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణంరాజు ఫ్యామిలీలో పెద్ద కొడుకైన ప్రభోద్.. కృష్ణంరాజుకి తలకొరివి పెట్టబోతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. కృష్ణంరాజు చనిపోవడానికి ముందే తనకు కర్మక్రియలను ఎవరు నిర్వహించాలనే విషయంపై మాట్లాడారు. ప్రముఖ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. తన కర్మక్రియల గురించి మాట్లాడారు. కృష్ణంరాజుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య యాక్సిడెంట్ లో చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కృష్ణంరాజుకి ఒక కూతురు ఉంది. ఆమెకి ఘనంగా పెళ్లి జరిపించారు కృష్ణంరాజు.
శ్యామలాదేవిని రెండో పెళ్లి చేసుకున్న తరువాత వీరికి ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. అయితే తన కొడుకులు లేరనే లోటు తన అన్నకొడుకులు ప్రభాస్, ప్రభోద్ లతో తీరిందని చెప్పారు కృష్ణంరాజు. తాను హిందూ ధర్మాన్ని పాటిస్తానని.. 'సోల్ అఫ్ ది డెత్' అనే పుస్తకం ద్వారా చనిపోయిన తరువాత జరిగే కర్మక్రియల గురించి తెలుసుకున్నానని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు కృష్ణంరాజు.
అలాంటి పరిస్థితి వచ్చినా.. తనకు కొడుకు లేరనే ఫీలింగ్ లేదని, తన సోదరుడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి.. వాళ్లు కూడా తన కొడుకులే అని.. వాళ్లే కర్మక్రియలను జరిపిస్తారని చెప్పారు కృష్ణంరాజు. ఆయన కోరుకున్నట్లుగానే ప్రభాస్ అన్నయ్య ప్రభోద్.. కృష్ణంరాజుకి కర్మక్రియలను జరిపించనున్నారు.
విజయనగర సామ్రాజ్య రాజవంశస్తులు:
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కృష్ణంరాజు 1940 జనవరి 20న జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. వీరు విజయనగర సామ్రాజ్య రాజకుటుంబానికి చెందిన వంశస్తులు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి. 1996లో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఆయనకు ప్రసీదీ, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా పని చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 1966లో చిలకా గోరింక చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1970, 1980లలో దాదాపు 183 కు పైగా సినిమాలలో నటించారు. 1977, 1984 సంవత్సరాల్లో నంది అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. 1986 లో తాండ్ర పాపారాయుడు అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. 2006లో ఫిల్మ్ ఫేర్ సౌత్ జీవన సాఫల్య పురస్కారం అందింది. బొబ్బిలి బ్రహ్మన్న, భక్త కన్నప్ప, సినిమాలు ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి.
రాధే శ్యామ్ చివరి సినిమా:
'రాధే శ్యామ్'లో తన తమ్ముడు సూర్యనారాయణ రాజు కుమారుడు ప్రభాస్‌తో కలిసి కృష్ణం రాజు నటించారు. ఆ సినిమాలో కూడా కేవలం ప్రభాస్ కోసమే నటించారు. నటుడిగా ఆయన చివరి సినిమా 'రాధే శ్యామ్'.
Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!
Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్