Harsha Engineers IPO: మన దేశంలో అతి పెద్ద ప్రెసిసన్ బేరింగ్ కేజ్‌ల (precision bearing cages) తయారీ కంపెనీ అయిన హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Harsha Engineers International Ltd) IPO ఎల్లుండి (బుధవారం - 14 సెప్టెంబర్ 2022) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 16 వరకు ఐపీవో సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటుంది.
ఈ కంపెనీ మీద మార్కెట్‌లో గట్టి అంచనాలున్నాయి. ప్రి-ఐపీవోలో అంటే, గ్రే మార్కెట్‌లో స్ట్రాంగ్ ప్రీమియంతో ఈ షేర్లు నడుస్తున్నాయి. ఇవాళ (సోమవారం) 40 శాతం ప్రీమియం వద్ద షేర్లు చేతులు మారుతున్నాయి.
ప్రైస్ బాండ్: రూ.314-330
ఈ కంపెనీ ఐపీవో కోసం, ఒక్కో షేరు ధరను (ప్రైస్ బాండ్) రూ.314-330 గా నిర్ణయించారు.
ఈ ఐపీవో ద్వారా రూ.755 కోట్లను సమీకరించాలని ఈ కంపెనీ భావిస్తోంది. ఇందులో, రూ.455 కోట్లు ఫ్రెష్ ఇష్యూ. ఈ మొత్తం కంపెనీ అకౌంట్‌లోకి వెళ్తుంది. మిగిలిన రూ.300 కోట్లను OFS మార్గంలో సమీకరిస్తారు. అంటే, ప్రమోటర్లు లేదా ప్రస్తుత పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న వాటాలను OFS ద్వారా అమ్మేస్తున్నారు. ఈ మొత్తం వాళ్ల సొంత ఖాతాల్లోకి చేరుతుంది, కంపెనీకి ఈ డబ్బుతో సంబంధం ఉండదు. ఐపీవోకి ముందు, ప్రమోటర్ల దగ్గర 99.70 శాతం షేర్లు ఉన్నాయి.
ఒక్కో లాట్‌కు ₹14,850 ఖర్చు
ఒక్కో లాట్‌కు 45 షేర్లను కేటాయించారు. బిడ్ వేయాలనుకున్నవాళ్లు 45 షేర్లకు ఒక లాట్ చొప్పును లాట్ల రూపంలో కొనాల్సివుంటుంది. కనిష్టంగా 1 లాట్ - గరిష్టంగా 13 లాట్లను రిటైల్ ఇన్వెస్టర్లు (మన లాంటి చిన్న ఇన్వెస్టర్లు) కొనవచ్చు. ఒక లాట్‌కు ₹14,850 ఖర్చవుతుంది. మొత్తం 13 లాట్ల కోసం బిడ్ వేస్తే, ₹1,93,050 కేటాయించాలి.
మొత్తం IPOలో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 35 శాతం షేర్లను కేటాయించారు.
ఈ నెల 26న లిస్టింగ్
ఈ నెల 21న షేర్ల అలాట్‌మెంట్ ఉంటుంది. షేర్లు దక్కని వాళ్ల డబ్బులను వెనక్కు ఇచ్చే ప్రక్రియ 22న ప్రారంభమవుతుంది. షేర్లు దక్కితే, 23న డీమ్యాట్ ఖాతాల్లో క్రెడిట్ అవుతాయి. ఈ షేర్లు ఈ నెల 26న మార్కెట్‌లో (ఎన్‌ఎస్‌ఈ + బీఎస్‌ఈ) లిస్ట్ కావచ్చు.
లాభం రెండింతలు
FY21లో దాదాపు రూ.877 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం FY22లో రూ.1339 కోట్లకు చేరింది. అంటే, 50 శాతం పైగా పెరిగింది. FY21లో నికరలాభం రూ.45.44 కోట్లుగా ఉంటే, FY22లో రూ.91.94 కోట్లకు చేరింది. ఇది కూడా రెట్టింపు పైగా పెరిగింది.
ఇంజినీరింగ్ బిజినెస్, సోలార్ ఈపీసీ బిజినెస్ కేటగిరీల్లో ఇది వ్యాపారం చేస్తోంది.
హర్ష ఇంజినీర్స్‌కు దేశంలోని ఐదు ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 65 దేశాలకు కూడా తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.