‘ఆర్ఆర్ఆర్’ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. హాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా అందించే అవార్డులను కొల్లగొడుతూ ఆస్కార్ రేసులో ముందుకు సాగిపోతుంది. లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అవార్డుల్లో Best Original Score అవార్డు ఎం.ఎం.కీరవాణికి దక్కింది. ఇక బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో మాత్రం ఎస్.ఎస్.రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. ఉత్తమ డైరెక్టర్ అవార్డు ‘TAR’ సినిమా దర్శకుడు టాడ్ ఫీల్డ్‌కు దక్కింది.


ఆస్కార్స్ రేసులో కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఈ సారి నిలబడనుందని తెలుస్తోంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరిల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ నామినేషన్‌కు దరఖాస్తు వెళ్లిందని సమాచారం. ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరును ఆస్కార్ నామినేషన్స్‌కు సబ్మిట్ చేశారని ఇంటర్నేషనల్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) పేర్కొంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే నామినేషన్స్ వచ్చేదాకా ఆగాల్సిందే.


ఈ సంవత్సరం మార్చి 25వ తేదీన విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల పరంగా కూడా రికార్డులు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. కేవలం నైజాంలోనే రూ.120 కోట్ల వరకు షేర్‌ను ‘ఆర్ఆర్ఆర్’ వసూలు చేయడం విశేషం. ఓవర్సీస్‌లో కూడా ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’నే. ఏకంగా ఏడు మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను ‘ఆర్ఆర్ఆర్’ యూఎస్‌ఏలో వసూలు చేసింది.


తాజాగా నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూలో ఈ సంవత్సరం 10 ఉత్తమ చిత్రాలలో ‘ఆర్ఆర్ఆర్’ కూడా చోటు దక్కించుకుంది. దీంతో ఆస్కార్ నామినేషన్ కోసం ఈ చిత్రం ఓ అడుగు ముందుకేసింది. అయితే ఈ పది చిత్రాల జాబితాలో మొదటి చిత్రంగా టామ్ క్రూజ్ నటించిన‘టాప్ గన్: మావెరిక్’ నిలిచింది.


హాలీవుడ్‌ లో ప్రతిష్టాత్మకంగా భావించే హెచ్.సీ.ఏ(HCA) స్పాటిలైట్‌ అవార్డును ఆర్‌ఆర్‌ఆర్‌ గెలుచుకుంది. అలాగే అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌ ఈ యేడాదికి గాను ఉత్తమ అంతర్జాతీయ సినిమా అవార్డుకు ఆర్‌ఆర్ఆర్‌ను ఎంపిక చేసింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుంద‌ని అందరూ భావిస్తున్నారు. 95వ అకాడెమీ అవార్డుల ప్రదానోత్సవం వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఇందుకోసం దర్శకుడు రాజమౌళి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇటీవల ఈ సినిమాను జపాన్‌లో కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. దాని కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ అక్కడకు వెళ్ళి ప్రచారం చేశారు కూడా. అక్కడ కూడా ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం విడుదల అయిన ముత్తు రికార్డును ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టింది.