Pawan Varahi Clear : పవన్ కళ్యాణ్ వాహనం వారాహి రంగుపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలు తేలిపోయాయి. వారాహి రిజిస్ట్రేషన్ కు తెలంగాణ రవాణా శాఖ అనుమతి ఇచ్చింది. వారాహికి ఉన్న రంగు.. ఆలీవ్ గ్రీన్ కాదని తేల్చారు. వాహనాలకు ఆలివ్ గ్రీన్ వాడొద్దని రూల్ ఉన్న మాట నిజమే కానీ.. వారాహి రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని అధికారులు నిర్ధారించారు. వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్‌ను పరిశీలించి.. ఆర్టీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆలివ్ గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ మధ్య సిమిలారిటీ ఉందని.. అయితే రెండూ ఒకటి కాదని రవాణాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
పవన్ వారాహి వాహనానికి ఉన్న కలర్ ఆలీవ్ గ్రీన్ కాదు ఎమరాల్డ్ గ్రీన్
రిజిస్ట్రేషన్ కోసం వాహనం తమ వద్దకు వచ్చినప్పుడు అన్ని నిబంధనలు పక్కాగా పరిశీలించామని.. నిబంధనల ప్రకారం వాహనం రంగు ఉండటంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అంగీకరించారు. వారం రోజులు క్రితమే TS13EX8384 నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని..ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ తెలంగాణ పాపారావు మీడియాకు తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం.. చాప్టర్ 121లో ఒక విషయం స్పష్టంగా ఉంది. డిఫెన్స్ శాఖకు చెందిన వాహనాలకు తప్ప అగ్రికల్చర్ ట్రాక్టర్లతో పాటు ఇతర ఏ వాహనాలకూ ఆలివ్ గ్రీన్ కలర్ పెయింటింగ్‌గా వేయకూడదని ఆ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం పవన్ ప్రచార రథమైన ‘వారాహి’కి ఎమరాల్డ్ గ్రీన్ పెయింటింగ్ వేయడంతో ఈ వివాదానికి దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్టే.
అన్నీ పరిశీలించి నిబంధనల ప్రకారమే ఉందని తేల్చామన్న రవాణా అధికారులు
వారాహి… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్. అంటూ పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచార రధాన్ని సిద్దం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రచార వాహనాన్ని తయారు చేశారు. ప్రత్యేక వసతులు అందులో కల్పించారు. కొండగట్టు- ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజలు చేసి వాహనం వినియోగించాలని నిర్ణయించారు. 1982లో తెలుగుదేశం పార్టీ ని స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అప్పట్లో గ్రీన్ కలర్ వాహనాన్నే ప్రచార రథంగా ఉపయోగించారు. పవన్ కల్యాణ్ కూడా అదే తరహాలో గ్రీన్ రంగుతో ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. అయితే వాహనంపై ఉన్న ఆలీవ్ గ్రీన్ అని.. నిబంధనల ప్రకారం రక్షణ రంగ వాహనాలకు తప్ప ఇతర ప్రైవేట్ వాహనాలకు ఈ రంగు వాడటంపై నిషేధం ఉందని వైసీపీ నేతలు వివాదాన్ని తెరపైకి తెచ్చారు.
వైఎస్ఆర్‌సీపీ నేతల ఆరోపణలన్నీ తేలిపోయినట్లే !
అయితే దీనికి జనసేన నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తమకు కోర్టులతో చీవాట్లు తినే అలవాటు లేదని.. నిబంధనలు తమకు తెలియవా అని ప్రశ్నంచారు. అన్నట్లుగానే ఏ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమైనవని తేలిపోయినట్లయింది. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు స్పందించాల్సి ఉంది.