BJP Vishnu On AP Govt : మాండూస్ తుఫాన్ ప్రాంత రైతులను తక్షణం ఆదుకోవాలని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాలలోని రైతులకు మాండూస్ తుఫాన్ తీవ్రమైన నష్టాన్ని చేకూర్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చేతికందిన పంట తుఫాన్ ధాటికి నీటమునిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి పంట నష్టపోయిన ప్రాంతాల్లో వెంటనే పర్యటించాలని.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం క్రింద ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పంట నష్టం అంచనాలకు వెంటనే కమిటీ వేయాలి
సంబంధిత జిల్లాల మంత్రులతో, ఇంఛార్జి మంత్రులతో, వ్యవసాయ అధికారులతో పంట నష్టపరిహారానికి సంబంధించిన కమిటీని వెంటనే వేయాలని ఈ కమిటీ వెంటనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, రైతులకు, ప్రజలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు. ప్రస్తుత మాండోస్ తుపాను వల్ల ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కోతలు పూర్తి చేసుకుని ఆరబోసిన ధాన్యం భీకరమైన వర్షాలకు తడిసి మొలకలొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నారు. వేల ఎకరాల్లో అరటి, బొప్పాయి, మామిడి వంటి ఉద్యాన పంటలలో చెట్లు నేలకొరిగాయని.. కంది, మిరప, టమాటా వంటి వాణిజ్య పంటలు నాశనమయ్యాయి. మొత్తంమీద లక్షన్నర ఎకరాలలో వివిధ రకాల పంటలను నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు. నష్టపరిహారాన్ని వీలయినంత త్వరగా అందించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు . లేకపోతే ఏపీ బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
ఏపీపై భారీగా మాండోస్ తుపాన్ ప్రభావం
తమిళనాడులో తీరం దాటిన మాండూస్ తుపాను కారణంగా ఏపీలోనూ భారీ వర్షాలు పడ్డాయి. అయితే ప్రభుత్వం మాండోస్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున ఒక్క కుటుంబంలో గరిష్టంగా రూ.2000 అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ ఆర్ధిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన తిరుపతి, నెల్లూరు, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని బాధితులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందించాలని సర్కార్ నిర్ణయించింది. అయితే పంటల నష్టపరిహారంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విపక్షాల విమర్శలు
మాండోస్ తుఫాన్ కారణంగా తిరుపతి , నెల్లూరు , వైఎస్సార్, చిత్తూరు , అన్నమయ్య జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. తడిసిన పంటను కొనుగోలు చేసి, తుఫాన్ బాధితులను ఆదుకోవాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రైతుల ధాన్యాన్ని తడవకుండా వారికి సరైన సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు.
బలప్రదర్శనకు సిద్ధమైన గంటా శ్రీనివాస్‌రావు- కాపునాడు పేరుతో భారీ బహిరంగ సభ!