బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేన చేయబోయే ప్రకటన ఏంటి? బీజేపీ స్నేహం వీడి టీడీపీతో జత కడుతుందా? ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అన్న పవన్ తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి? అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా కొనసాగుతున్న డిస్కషన్.
ఇన్నాళ్లు ఒక లెక్కా ఇప్పటి నుంచి మరో లెక్క... జనసేన వచ్చిందని జగన్‌కు చెప్పండీ... అన్న స్టైల్‌లో చాలా రోజుల క్రితం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెనెక్కించే ప్రసక్తి లేదని... ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా గట్టిగానే ప్రయత్నాలు చేస్తామన్నారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ వేసే ప్రతి అడుగుపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చే మరో ప్రకటన కూడా సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన ప్రకటన రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. పొత్తులపై త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని శ్రీకాకుళం జిల్లాలో ఆయన చేసిన కామెంట్ కాకా పుట్టిస్తోంది. ఇప్పటికే బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది.
2019 ఎన్నికలు పూర్తైన కొన్ని నెలల్లోనే జసేనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నాయి. పేరుకే ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నా... ఏ ఒక్క అంశంలోనూ కలిసి నడిచింది లేదు. వివిధ అంశాలపై రెండు పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినా కలిసి చేసింది మాత్రం చాలా చాలా తక్కువ. ఆ కార్యక్రమాలు ఏవీ అంటే ఆ పార్టీలు కూడా చెప్పలేవేమో అన్నంతలా ఉంటాయి.
బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అన్న సందేహాలు కలుగుతున్న వేళ... పవన్ చేసిన కామెంట్స్ కూడా చాలా అనుమానాలకు తావిచ్చాయి. రోడ్ మ్యాప్ తనకు ఇవ్వలేదని పవన్ ప్రకటన చేయడం... తర్వాత తామెప్పుడో రోడ్ మ్యాప్ ఇచ్చామని సోమువీర్రాజు లాంటి వాళ్లు కౌంటర్ ఇవ్వడం కాకరేపింది. దీంతో జనసేనకు, బీజేపీ రాష్ట్రనాయకత్వం మధ్య గ్యాప్ ఉందని స్పష్టమైంది. సమయం వచ్చినప్పుడల్లా బీజేపీ రాష్ట్రనాయకత్వంపై పవన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు.
విశాఖ ఘటన తర్వాత మారిపోయిన రాజకీయం. విశాఖ పర్యటనకు పవన్ వెళ్లడం... ఆయన్ని నిర్బంధించిన పోలీసులు... విజయవాడ పంపేశారు. దీనిపై వైసీపీ మినహా అన్ని పార్టీలు పవన్‌కు మద్దతుగా నిలిచాయి. అయితే టీడీపీ అధినేత నేరుగా పవన్ బస చేసిన హోటల్‌కు వెళ్లి సంఘీభావం ప్రకటించడమే కాకుండా... ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి వచ్చేవారితో పోరాటం చేస్తామని ఇరువురు నేతలు ప్రకటించారు.
పవన్, చంద్రబాబు కలవడంతో పొత్తులపై దాదాపు క్లారిటీ వచ్చిందన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. అయితే బీజేపీ మాత్రం తాము టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని... తాము జనసేనతోనే పొత్తులో ఉన్నామని ప్రకటించింది. దీనిపై ఇలా భిన్న వాదనలు కొనసాగుతున్న టైంలో విశాఖలో మోదీ పర్యటన ఏపీ రాజకీయాన్ని మరో మలుపు తిప్పింది.
విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ఏకంతంగా భేటీ కావడంతో ఎవరితో ఎవరికి పొత్తు ఉంటుంది... అసలు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయనే డిబేట్స్ నడిచాయి. ఈ భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయారు. దీంతో టీడీపీని సైడ్ చేశారనే ప్రచారం జోరుగా సాగింది.
కానీ నాదెండ్ల ప్రకటనతో మరోసారి పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు ఉంటాయని తెలిపారు. కచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తులు ప్రకటించబోతున్నామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రకటన ఎలా ఉంటుందనే ఊహాగానాలు మొదలైపోయాయి. మరి పవన్ వేసే ఆ పొత్తుల ఎత్తు ఏంటో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.