విశాఖ వేదికగా 26న జరిగే భేటీపై చర్చ మొదలైంది. ఇది ఓ సామాజిక వర్గానికి చెందిన సమావేశమే అయినా అందులో ఎవరు పాల్గొంటారు. ఏం నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ఇది గంటా శ్రీనివాసరావు లీడ్ తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతున్నా.. దాన్ని ఆయన ఖండించారు. అయినా ఇది ఆయన బలప్రదర్శనకు చేస్తున్న  ప్రయత్నంగా విశాఖలో చర్చ జరుగుతోంది. 
 
ఏపీ రాజకీయాల్లో కాపు సమాజిక వర్గం భేటీ మరోసారి చర్చనీయాంశమైంది. ఆ మధ్య కాపు నేతలందర్నీ ఒక చోట చేర్చి కీలక సమావేశం నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈసారి కాపునాడు పేరుతో విశాఖలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారట. 


రాధా - రంగా రీయూనియన్ అధ్వర్యంలో ఈ నెల 26లో విశాఖలో కాపు నాడు బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబందించిన ఓ పోస్టర్‌ను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస్, పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ కీలక కామెంట్స్ చేశారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. 


పోస్టర్ రిలీజ్‌ సందర్భంగా గంటా చేసిన కామెంట్స్... ఈ సభ ఇన్నర్‌ అజెండాను చెప్పకనే చెప్పారు. ప్రతీ కార్యక్రమం అనివార్యంగా రాజకీయాలతో ముడిపడే ఉంటుందన్నారు గంటా శ్రీనివాస్ రావు. ఈ కాపునాడు సభకు కూడా ఉన్న రాజకీయ అజెండాను ఆర్గనైజర్స్ సరైన సమయంలో వివరిస్తారని బాంబు పేల్చారు. ఈ కాపునాడు సభ తాను లీడ్‌ తీసుకుంటున్నట్టు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు గంటా. 


రాజకీయాలకు అతీతంగా కాపునాడు సభ జరుగుతుందనే చెబుతూనే రాజకీయాలపై చర్చ ఉంటుందన్నారు గంటా శ్రీనివాస్ రావు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారంపై కూడా గంటా స్పందించారు. పార్టీ మారుతున్నట్టు తాను ఎప్పుడూ చెప్పలేదని వివరించారు. తన ప్రమేయం లేకుండానే పార్టీ మార్పుపై మీడియా ప్రచారం చేస్తోందని సెటైర్లు వేశారు. 


ఆంధ్రా రాజకీయాల్లో రంగా పాత్ర చారిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు గంటా శ్రీనివాస్‌రావు. ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న కాపునాడు సభ విజయవంతం చేయాల్సిన అవసరం కాపు లీడర్లకు ఉందని పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడిన పద్మశ్రీ డాక్టర్ సుంకర ఆదినారాయణ... కాపులలో ఐక్యత లేదనే ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. దీన్ని మార్చేలా సామాజిక వర్గం ముందుకు వెళ్ళాలని సూచించారు. ఐక్యత లేకపోతే ప్రాధాన్యత ఉండదని హెచ్చరించారు. 


కాపు లీడర్లను ఒకచోట చేర్చేందుకు గంటా శ్రీనివాస్ రావు గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్‌లో ఒకసారి, వైజాగ్‌లో మరోసారి భేటీ అయ్యారు. 2021 డిసెంబర్‌, 2022 ఫిబ్రవరిలో జరిగిన ఈ సమావేశాల్లో కాపు సామాజిక ప్రముఖులు కీలక చర్చలు జరిపారు. మొదటి మీటింగ్‌ సీక్రెట్‌గా సాగినా రెండోది భిన్నంగా జరిగింది. ఈసారిది మాత్రం భారీగా గంటా శ్రీనివాసరావు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఈ భేటీల్లో మాజీ డీజీపీ సాంబశివరావు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, వట్టి వసంత కుమార్, బోండా ఉమ పాల్గొన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయమే ముఖ్యం అంటూ వారు నిర్ణయించారు. బహుజనులను కలుపుకొని రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఏపీలో ఎదగాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు నేతలు తెలిపారు.


రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఒక వేదిక ఉండాలంటూ ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీని ప్రారంభించామని కాపు నేతలు చెబుతున్నారు. ఇన్నాళ్లకు మళ్లీ మరో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే రంగా వర్ధంతికి నేతలంతా సమావేశం ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా లీడర్లను ఆహ్వానించనున్నారు. కానీ ఎంతమంది వస్తారో అన్న చర్చ జోరుగా సాగుతోంది.