సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు లేదా దర్శకుల కెరీర్ లో టాలెంట్ తో పాటు అదృష్టం, అవకాశాలు కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఓ హీరోతో సినిమా అనుకున్నాక ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేసరికి ఆ హీరో బదులు ఇంకో హీరోకు వెళ్లిపోతుంది. అలాగే సినిమా కథల విషయంలోనూ అలాంటి మార్పులు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఓ కథకు దర్శకుడు ఓకే అయిన తర్వాత కూడా ఒక్కోసారి దర్శకులు ఆ కథ నుంచి తప్పుకుంటారు. వేరే దర్శకుడితో ఆ సినిమాను తెరకెక్కిస్తుంటారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. 


2019లో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమా చేశారు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా అంతగా ఆకట్టుకోకపోయినా విజయ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. అయితే ఈ సినిమా కంటే ముందు ఆ సంస్థ విజయ్ కు మరో చిత్రానికి ఆఫర్ ఇచ్చినట్టు పాత నివేదికలు చెబుతున్నాయి. మైత్రి మూవీస్ టీమ్ మొదట ‘అమిగోస్’ సినిమాను విజయ్ దేవరకొండతో తీయాలని అనుకున్నారట. అయితే ‘అర్జున్ రెడ్డి’, ‘డియర్ కామ్రేడ్’ స్క్రిప్ట్ ల పై ఎక్కువ ఆసక్తి చూపించడం వల్ల ఆ సినిమాకు ఆయన నో చెప్పారట.  


ఆ తర్వాత ‘అమిగోస్’ సినిమా స్కిప్ట్ కొన్నేళ్ల పాటు పలు హీరోలకు చెప్పారట. అయితే ఎవరూ అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఈ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. చివరకు నందమూరి కళ్యాణ్ రామ్ దగ్గరకు ఈ కథ చేరింది. ఆయనకు ఈ స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. ఈ ‘అమిగోస్’ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్వకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ బాగుండటంతో మూవీ పై ఆసక్తి నెలకొంది. 


కళ్యాణ్ రామ్ గతేడాది ‘బింబిసార’ మూవీలో నటించారు. ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది. ‘పటాస్’ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ విభిన్న కథలనే ఎంచుకుంటూ వస్తున్నారు. అందుకే ఆయన నుంచి రాబోతున్న ‘అమిగోస్’ పై ఉత్కంఠ నెలకొంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో మొదటి సారిగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నారు. కళ్యాణ్ రామ్ గతంలో ‘హరే రామ్’ వంటి సినిమాల్లో డబుల్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఇప్పుడు ఏకంగా ట్రిపుల్ రోల్ లో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఈ మూవీలో కన్నడ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నటిస్తోంది. ఆషికాకు ఇదే మొదటి తెలుగు సినిమా. ఈ మూవీకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది.  ఈ సినిమా ఫిబ్రవరి 10న గ్రాండ్ గా విడుదల కానుంది. 


Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?