పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ఆయన, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని సినీ జనాలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ సినిమా సమయంలో అనుష్క, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ జంట చూడ ముచ్చటగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. కానీ, ప్రస్తుతం అనుష్క ప్లేస్ లోకి కృతి సనన్ వచ్చి చేరింది. ప్రభాస్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ లో ఉందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటిని ప్రభాస్, కృతి అవాస్తవం అని తేల్చి చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదు.


మాల్దీవుల్లో ప్రభాస్, కృతి నిశ్చితార్థం?


తాజాగా ప్రభాస్, కృతి సనన్ త్వరలో ఎంగేజ్ మెంట్ జరుపుకోబోతున్నారంటూ బాలీవుడ్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు చేసిన ట్వీట్ సంచలనం అయ్యింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాతో పాటు సినీ ఇండస్ట్రీలోనూ హల్ చల్ చేసింది. “బ్రేకింగ్ న్యూస్: కృతి సనన్, ప్రభాస్ వచ్చే వారం మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. ఇది వారిద్దరికీ చాలా సంతోషకరమైనది” అంటూ ఉమైర్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది తప్పుడు వార్త అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయగా, నిజమేనా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఉమైర్ సంధు చేసే ట్వీట్లు చాలా వరకు వివాదాస్పదంగానే ఉంటాయి. బాలీవుడ్ నటీనటులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపైనా ఆయన ట్వీట్స్ చేస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆయనపై కేసు పెట్టిన సందర్భాలున్నాయి. 






కృతి-ప్రభాస్ ప్రేమాయణంపై వరుణ్ ధావన్ కీలక వ్యాఖ్యలు


 కాసేపు ఉమైర్ సంధు ట్వీట్ గురించి పక్కన పెడితే, ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ప్రస్తావించాడు. కృతి సనన్, ప్రభాస్ రిలేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ షోలో ఆయన ఆసక్తికర విషయం చెప్పాడు.  కృతి సనన్ ప్రస్తుతం దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తున్న భారీ ప్రాజెక్టు హీరోతో ప్రేమలో ఉందని చెప్పాడు. ఇంతకీ దీపికా చేస్తున్న పెద్ద ప్రాజెక్టు హీరో ఎవరని పరిశీలిస్తే, తను ప్రభాస్. దీపిక, ప్రభాస్ కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృతి, ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే వార్తలు నిజమేనని తేలినట్లైంది.






ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాడు - రామ్ చరణ్


తాజాగా ప్రభాస్, బాలయ్య అన్‌స్టాపబుల్‌ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి చరణ్ చిన్న హింట్ ఇచ్చాడు. త్వరలోనే ప్రభాస్ నుంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పాడు. ఆ గుడ్ న్యూస్ కృతి, ప్రభాస్ పెళ్లేనని ఇప్పుడు అర్థం అవుతోంది. అయితే, ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంటుంది. ఇక ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘ఆది పురుష్’ ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.   


Read Also: ఆరంభం అదిరింది - బ్లాక్ బస్టర్లతో మొదలైన 2023, బాలీవుడ్‌కూ మంచి రోజులు!