మలయాళ క్యూట్ కపుల్ ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్గు రించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ‘రాజా రాణి’, ఇటీవల ‘అంటే సుందరానికి’ మూవీతో నజ్రియా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. అలాగే, ఫహాద్ ‘పుష్ప’ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఫహద్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది నజ్రియా. ఆ తర్వాత భార్యభర్తలు ఇద్దరు కలిసి ‘ట్రాన్స్’ అనే సినిమాలో నటించారు. ఇంతకీ వీరు ఎలా కలిశారు? ప్రేమ కథ ఎలా మొదలయ్యింది? పెళ్లి వెనుకున్నట్విస్టులు ఏంటి?
ఫహద్ ఫాసిల్, నజ్రియా నజీమ్ ‘బెంగుళూరు డేస్’ మూవీలో భార్యాభర్తలుగా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. అదే సినిమా సెట్స్‌పై వీరి ప్రేమ కథకు పునాది పడింది. ఈ సినిమాలో కపుల్స్ గా నటించిన ఈ జంట, మూవీ విడుదలకు ముందే నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 2014లో అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 21న వివాహం చేసుకున్నారు.
పెళ్లి చేసుకుందామని ముందు ఎవరు చెప్పారు?
ఫహద్ తో ప్రేమ, పెళ్లి గురించి ముందుగా ప్రస్తావించింది నజ్రియా. సినిమా సెట్ లోనే ఫహద్ దగ్గరికి వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగిందట. ఈ విషయాన్ని స్వయంగా ఫహద్ చెప్పారు. “జీవితాంతం ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. నాతో ఎవరూ కూడా ఇలాంటి మాట చెప్పలేదు. అలాంటి అమ్మాయి ప్రేమను ఎవరు కోరుకోరు?” అని ఆయన చెప్పుకొచ్చారు.
పెళ్లి తర్వాత నాలుగేళ్లు సినిమాలకు దూరం
వివాహం తర్వాత నజ్రియా నటనకు దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకుంది. తన వివాహ జీవితంపై దృష్టి పెట్టింది. ఆ సమయంలో ఫహద్ ఫాసిల్ ను వెనకుండి నడిపించింది. ఆ సమయంలో తన కెరీర్ లో వచ్చిన సక్సెస్ లో ఆమె శ్రమ చాలా ఉందని చెప్పారు ఫహద్. "నేను నజ్రియాను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా విజయాలు సాధించాను. వాటిని ఒంటరిగా నేను సాధించలేనని తెలుసు” అని చెప్పుకొచ్చారు.
ఎన్నో.. విమర్శలు
ఫహద్, నజ్రియా పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇద్దరి మధ్య వయసులు భారీ తేడా ఉండటంతో బాగా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. పెళ్లి నాటికి నజ్రియా వయసు 19 ఏళ్లు కాగా, ఫహద్‌కు 32 ఏళ్లు. అంతేకాదు, పెళ్లి తర్వాత నజ్రియాను నటించకుండా అడ్డుకున్నారని విమర్శలు వచ్చాయి. వాటన్నింటినీ ఈ జంట ఎదుర్కొని నిలబడింది.
పెళ్లి తర్వాత నాలుగేళ్లకు నజ్రియా, అంజలి మీనన్ దర్శకత్వం వహించిన ‘కూడే’ (2018)లో నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనంతరం నజ్రియా, ఫహద్ ఫాసిల్ కలిసి ‘ట్రాన్స్’ (2020)లో కూడా నటించింది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా ఇద్దరూ కెరీర్ కొనసాగిస్తున్నారు. నజ్రియా తెలుగులో నటించిన ‘అంటే సుందరానికి..’ సినిమా మంచి టాక్ వచ్చినా, హిట్ మాత్రం కొట్టలేదు. అయితే, ఫహాద్ మాత్రం ‘పుష్ప’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Read Also: యూట్యూబ్ నుంచి ‘భీడ్‘ ట్రైలర్ తొలగింపు, ప్రజాస్వామ్య హత్య అంటూ నెటిజన్ల ఆగ్రహం