Pseudo Naxal Arrest : నక్సలైట్ పేరు చెప్పుకొని ఎయిర్ గన్స్ తో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు సూడో నక్సల్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నించి రెండు ఎయిర్ గన్స్, ఒక మోటర్ సైకిల్, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ... మంచిర్యాల జిల్లాలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై రవి కుమార్ సిబ్బందితో కలిసి తోళ్లవాగు సమీపంలో వాహన తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో బైక్ పై పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిందితులని పట్టుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు.
అసలేం జరిగింది?
నిందితులు మేడి వెంకటేష్, ఆరేందుల.రాజేష్ చిన్నపటి నుంచి స్నేహితులు. కొంత కాలంగా ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ సరిగా లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వెంకటేష్, రాజేష్ సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఎవరినైనా అమాయకులని నక్సలైట్ ల పేరుతో ఫోన్ లో బెదిరించి డబ్బులు వసూలు చేయాలనుకున్నారు. రాజేష్ తను చెప్పినట్లు వింటే నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని వెంకటేష్ ని ఒప్పించి, కొంత కాలం నుంచి ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోకుండా, కలిసినప్పుడే మాట్లాడుకోవాలని నిర్ణయం తీసుకోన్నారు. రాజేష్ చెప్పిన ప్రకారం వెంకటేష్ హైదరాబాద్ నుంచి రెండు ఎయిర్ గన్స్ కొనుగోలు చేసి, నక్సలైట్ పేరుతో మాట్లాడానికి గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి ఫోన్, సిమ్ కొనుగోలు చేశారు.
రూ.40 లక్షలు డిమాండ్
తరువాత నస్పూర్ లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేసి, ఫిబ్రవరి 21 రాత్రి సమయంలో రాజేష్ చెప్పిన పథకం ప్రకారం వెంకటేష్ తన పల్సర్ బండి మీద రెండు ఎయిర్ గన్స్ ని సంచిలో పెట్టుకొని కాంతయ్య ఇంటి ఆవరణలో పడవేసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారు జామున రాజేష్, వెంకటేష్ లు కలిసి కాంతయ్య, అతని కొడుకు నాగరాజులకి ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుంచి నక్సలైట్స్ మాట్లాడ్తున్నాం, మీ ఇంటి ముందు తుపాకులు పెట్టాం, మీరు 40 లక్షలు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులను అందరిని చంపుతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితుల ఇద్దరినీ అరెస్ట్ చేశారు. రాజేష్ మీద గతంలో మంచిర్యాల, హాజీపూర్ ఏరియాలలో పలు కేసులు నమోదు అయ్యాయి. నిందితుల నుంచి రెండు ఎయిర్ గన్స్, పల్సర్ బైక్ , ఒక మొబైల్ స్వాధీనం చేసుకోన్నామని సీపీ తెలిపారు.