దేశంలో కరోనా పాటు ఒమిక్రాన్ వేరియంట్ కూడా విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా బారిన పడ్డ వారి సంఖ్య లక్ష దాటేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ కరోనా మహమ్మారి ఎవరినీ విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. బాలీవుడ్ లో అర్జున్ కపూర్, స్వరా భాస్కర్, ఏక్తా కపూర్ ఇలా చాలా మంది కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. 


టాలీవుడ్ లో పేరున్న సెలబ్రిటీలు చాలా మందికి కరోనా సోకింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కోవిడ్ బారిన పడి ఇప్పుడు ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఇప్పుడేమో రేణుదేశాయ్, ఆమె కుమారుడు అకీరా నందన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని రేణు స్వయంగా వెల్లడించింది. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. 


''అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉన్నప్పటికీ.. నేను, అకిరా కరోనా బారిన పడ్డాం. కొన్నిరోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించగా.. పరీక్షలు చేయిస్తే కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం కోలుకుంటున్నాం. గతేడాది నేను రెండు వ్యాక్సిన్‌ డోస్ లు వేయించుకున్నాను. అయినప్పటికీ కరోనా సోకింది. అకీరాకు వ్యాక్సిన్‌ వేయించాలని అనుకునేలోపు అతడికి కూడా కరోనా వచ్చింది. ఈ థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకొని జాగ్రత్తగా ఉండండి. మాస్క్ లు ధరించండి'' అంటూ రేణుదేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది.