Rashmika Mandanna About Fans Love: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అటు దక్షిణాదితో పాటు ఇటు బాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకుంది. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన అభిమానుల గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టింది. ఓ పబ్లిక్ ఈవెంట్ లో అభిమానుల నుంచి వెల్లువెత్తిన ప్రేమాభిమానాల పట్ల రష్మిక సంతోషం వ్యక్తం చేసింది.
కేరళ అభిమానుల ప్రేమ, రష్మిక ఆనందం
రీసెంట్ గా కేరళలో జరిగిన ఓ ఈవెంట్ కు రష్మిక మందన్న వెళ్లింది. అక్కడ ఆమెను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. వారిని చూసి ‘పుష్ప’ బ్యూటీ సంతోషం వ్యక్తం చేసింది. వారి ప్రేమకు ముగ్దురాలు అవుతూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వెల్లడించింది. “రీసెంట్ ఓ ఈవెంట్ లో భాగంగా జులై 25న కేరళలోని కరునాగపల్లికి వెళ్లాను. అక్కడి ఆర్గనైజర్లు ఆ ఈవెంట్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. నన్ను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. వాళ్లు నా మీద చూపించిన ప్రేమకు ఆశ్చర్యపోయాను. వారి నుంచి అంత ప్రేమను అస్సలు ఊహించలేదు. వారి అభిమానంతో నా మనసు ఉప్పొంగింది. వారు నా పట్ల చూపిస్తున్న ఆరాధన భావానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు.
ఇంత మంది ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకు తెలియడం లేదు. మీ ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని వెల్లడించింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు సంబంధించిన పలు ఫోటోలను రష్మిక షేర్ చేసింది.
వరుస సినిమాలతో రష్మిక ఫుల్ బిజీ
ఇక రీసెంట్ గా రష్మిక మందన్న ‘యానిమల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణబీర్ కపూర్ హీరోగా, తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 1000 కోట్లు వసూళ్లతో దుమ్మురేపింది. వాయిలెన్స్ ఎక్కువైందంటూ విమర్శలు వచ్చినా, ప్రేక్షకుల ఈ సినిమాను బాగానే ఆదరించారు. ప్రస్తుతం ఈ ముదుగుమ్మ చేతిలో సుమారు అరడజన్ సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘సికిందర్’, ‘కుబేరా’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. అటు లక్ష్మణ్ ఉతేకర్ తెరకెక్కిస్తున్న ఓ బాలీవుడ్ మూవీలోనూ ఆమె హీరోయిన్ గా చేస్తోంది.
Read Also: రవితేజను అన్‌ఫాలో చేసిన ఛార్మీ - కారణం అదేనా? అసలేం జరుగుతుంది..!