Manu Bhaker Wins 1st Medal for India | పారిస్: విశ్వ క్రీడల్లో భారత్ పతకాల బోణి కొట్టింది. తొలిరోజు నిరాశే ఎదురైనా, పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ కు తొలి పతకం లభించింది. షూటింగ్‌లో మనుబాకర్ భారత్‌కు తొలి పతకం అందించింది. 10మీ.ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ లో కాంస్యం సాధించింది. తొలి పతకంతో త్రివర్ణ పతకాం రెపరెపలాడించింది. షూటింగ్ లో భారత్ కు మెడల్ సాధించిన తొలి మహిళా షూటర్ గా చరిత్ర లిఖించింది.
దక్షిణ కొరియాకు చెందిన ఓ యే జిన్ స్వర్ణం కైవసం చేసుకుంది. అదే దేశానికి చెందిన కిమ్ యేజి రజతంతో సరిపెట్టుకోగా, భారత్ కు చెందిన మను బాకర్ కాంస్యం నెగ్గింది. స్వర్ణం సాధించిన ఓ యే జిన్ ఓవరాల్ గా 242.2 పాయింట్లతో సత్తా చాటింది. రజతం సాధించిన కిమ్ యేజి 241.3 పాయింట్లు, మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించింది.
షూటింగ్ లో ఇది 5వ పతకం
2004లో ఏథెన్స్ లో జరిగిన ఒలింపిక్స్ నుంచి లండన్ 2012 ఒలింపిక్స్ వరకు వరుస మూడు విశ్వ క్రీడల ఈవెంట్లో షూటింగ్ విభాగంలో భారత్ పతకాలు సాధించింది. గత రెండు ఒలింపిక్స్ లో భారత్‌కు షూటింగ్ లో పతకం రాలేదు. తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన 22 ఏళ్ల మను బాకర్ కాంస్యం నెగ్గింది.
2004 ఒలింపిక్స్ లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ భారత్ కు తొలి షూటింగ్ మెడల్ నెగ్గాడు. రజత పతకంతో దేశంలో షూటింగ్ పై ఆశలు రేపాడు. ఆపై బీజింగ్ లో జరిగిన 2008 ఒలింపిక్స్ లో అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించాడు. 2012లో లండన్ లో జరిగిన ఒలింపిక్స్ లో గగన్ నారంగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతకం, 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్ కుమార్ కాంస్యం సాధించారు.
అతిపిన్న వయసులో మను బాకర్ అద్భుతం: నీతా అంబానీ
ఒలింపిక్స్ లో మహిళా షూటర్ భారత్‌కు తొలి పతకం సాధించడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఇది ఎంతో అపురూపమైన క్షణం అని, పారిస్ ఒలింపిక్స్‌లో అతి పిన్న వయసులోనే మహిళా షూటర్ మను బాకర్ కాంస్యం సాధించింది. ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళగా, అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించిన మను బాకర్‌కు అభినందనలు. ఈ రోజు నువ్వు సాధించిన విజయం భారతదేశంలో మరింత మంది యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. గో ఇండియా గో.. భారత్ గర్వపడేలా చేయండి’ అన్నారు.