మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను(RC15) రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వానీని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ సడెన్ గా ఆయన 'ఇండియన్ 2' సినిమాను రీస్టార్ట్ చేయడంతో చరణ్ సినిమాను పక్కన పెట్టినట్లు వార్తలొచ్చాయి.
మొన్నామధ్య ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు శంకర్. 'ఇండియన్ 2', 'RC15' సినిమాలను సమాంతరంగా చిత్రీకరించబోతున్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు శంకర్ తన ఫోకస్ మొత్తం 'ఇండియన్2' సినిమాపైనే పెట్టినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తో మొదలుపెట్టాలనుకున్న కొత్త షెడ్యూల్ ను ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. దీంతో ఈ నెల మొత్తం చరణ్ ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో కూడా కొన్ని రోజుల పాటే షూటింగ్ జరిగింది.
ఇప్పటివరకు చరణ్ తన తదుపరి సినిమాపై నిర్ణయం తీసుకోలేదు. అందుకే ఆయన ఖాళీగా ఉండాల్సి వచ్చింది. మరో సినిమా కోసం రామ్ చరణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏవీ కొలిక్కి రావడం లేదు. 'విక్రమ్' సినిమా హిట్ అవ్వగానే కమల్ హాసన్ తో భారీ సినిమా వర్కవుట్ అవుతుందని నిర్మాతలకు, శంకర్ కు నమ్మకం కలిగింది. దాంతో ఆగిపోయిన 'ఇండియన్2' సినిమాను హడావిడిగా తీస్తున్నారు. బహుశా వేరే దర్శకుడెవరైనా ఇలా చేస్తే చరణ్ ఒప్పుకునేవారు కాదేమో. కానీ అక్కడ శంకర్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు కావడంతో ఆయన సైలెంట్ గా ఉండాల్సివస్తుంది.
ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శ్రీకాంత్, అంజలి, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర వంటి తారలు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
RC16 కన్ఫర్మ్ అయినట్లేనా?
కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. 'మఫ్తి' అనే సినిమాతో కన్నడలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నర్తన్. చాలా కాలంగా ఆయన చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా కథ సెట్ అవ్వడంతో చరణ్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో.. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫైనల్ నేరేషన్ ఇచ్చారు నర్తన్. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.