Vettaiyan Collection Worldwide: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో టీ.జే. జ్ఞానవేల్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘వేట్టయన్ - ద హంటర్’. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. విడుదలైన ప్రతి చోటా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ. 240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా విడుదలైన తొలి రోజును మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, నెమ్మదిగా ప్రేక్షకుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈ మూవీని చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. వసూళ్ల పరంగానూ రజనీ మూవీ సత్తా చాటుతోంది.
సామాజిక అంశాలతో తెరకెక్కిన ‘వేట్టయన్’
టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన ‘వేట్టయన్’ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. గ్రిప్పింగ్ కథాంశం, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందనే టాక్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తోంది. న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్, అవినీతి, విద్యా వ్యవస్థ సహా పలు సామాజిక అంశాలను బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా చాలా బాగుందంటున్నారు. డైరెక్టర్ టేకింగ్ కూడా ఆకట్టుకునేలా ఉందంటున్నారు ఆడియెన్స్. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. ప్రతి యాక్టర్ ఎనర్జిటిక్ పర్ఫార్ మెన్స్ తో ఆకట్టుకున్నారు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది.
విజయంతో నిర్మాత సుభాస్కరన్ సంతోషం
‘వేట్టయన్’ మూవీ సక్సెస్ పట్ల లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల హ్యాపీ ఫీలవుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులతో పాటు సినీ లవర్స్ నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. విడుదలైన అన్ని చోట్లా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నట్లు చెప్పారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ఇతర నటీనటులకు కెరీర్ లో ఈ సినిమా గుర్తుండిపోతుందన్నారు.
తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న అగ్ర నిర్మాతలు
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. లైకా ప్రొడక్షన్స్ కు చెందిన GKM తమిళ కుమారన్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై M షెన్ బాగమూర్తి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. ‘వెట్టయన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా రన్ అవడంతో పాటు సుమారు రూ. 250 కోట్లకు చేరకోవడం పట్ల చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది.
Read Also: కూతురిని వేధిస్తున్నాడంటూ మాజీ భార్య కంప్లైంట్... స్టార్ డైరెక్టర్ తమ్ముడు అరెస్ట్