దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది టీమ్. రీసెంట్ గా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. 

 

దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసింది చిత్రబృందం. ఇందులో వీరు ముగ్గురు పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు మొదటిరోజు థియేటర్లో సినిమా చూడాలని ఉంది. దీనికి రాజమౌళి ఓ సలహా ఇచ్చారు. ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఉంటారు కాబట్టి వెళ్లడం కష్టమని.. కాబట్టి ముందు రోజు రాత్రి అందరికంటే ముందు థియేటర్ కి వెళ్లి అక్కడే పడుకోవాలని చెప్పారు రాజమౌళి. 

 

ఇక తెల్లవారుజామున ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీస్ థియేటర్ కి వస్తాయి కాబట్టి వాళ్లతో సినిమా చూసి తిరిగి వెళ్లిపోవాలని అన్నారు. కార్తికేయ(రాజమౌళి కుమారుడు) తనకు ఓ సలహా ఇచ్చాడని రామ్ చరణ్ అన్నారు. ప్రొస్థెటిక్ మేకప్ వేసుకొని సినిమాకి వెళ్తే బెటర్ అని చెప్పినట్లు రామ్ చరణ్ తెలిపారు. అది కూడా మంచి ఐడియా అని రాజమౌళి అన్నారు. ఇదివరకు రజినీకాంత్ ఆయన సినిమాలను థియేటర్లలో అలానే ప్రొస్థెటిక్ మేకప్ వేసుకొని చూసేవారని రామ్ చరణ్ అన్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు మొదటిరోజు తమ సినిమాను ఎలా చూస్తారో..!

 

డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్ కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.