టాలెంట్ ఉంటే టాలీవుడ్‌లో పైకి రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. టాలెంట్‌కు తగ్గ అవకాశాలు కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు ఏమో కానీ... అవకాశాలు రావడం మాత్రం పక్కా! అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్.... రఘు కుంచె (Raghu Kunche). తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన ఆయన... ఇప్పుడు నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. మరోవైపు సంగీతం కూడా అందిస్తున్నారు. త్వరలో హీరోగా మారనున్నారని సమాచారం.
విలన్‌గా ఫుల్ బిజీ!
చిన్న సినిమాలకు రఘు కుంచె వరంలా మారారు. ముఖ్యంగా మనదైన యాస, భాషలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందిస్తున్న సినిమాల్లో కీలక పాత్రలకు రఘు కుంచె ఫస్ట్ ఛాయస్‌గా ఉన్నారు. అక్టోబర్ నెలాఖరున థియేటర్లలో విడుదలైన 'రుద్రవీణ' సినిమాలో ఆయన విలన్ రోల్ చేశారు. దీని కంటే ముందు 'పలాస 1978'లో, రవితేజ 'డిస్కో రాజా' తదితర సినిమాల్లో నటించారు. 'మా నాన్న నక్సలైట్'లో తండ్రిగా కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు ఆయన విలన్‌గా ఐదు సినిమాలు చేస్తున్నారు. అందులో మూడు విడుదలకు రెడీగా ఉన్నాయి.
రఘు కుంచె మెయిన్ లీడ్‌గా మూవీ!
Raghu Kunche As Main Lead, Movie Starts In December : ఇప్పుడు రఘు కుంచె మెయిన్ లీడ్‌గా మూవీ చేయడానికి ఓ దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత కూడా రెడీ! సాధారణంగా తెలుగులో మెయిన్ లీడ్ అంటే హీరో అని అంటారు. రఘు కుంచె తనకు హీరోగా నటించాలని లేదని చెప్పేశారట. కథ విన్న తర్వాత రెగ్యులర్ హీరో తరహా రోల్ కాకుండా... కొత్తగా ఉండటంతో ఓకే చెప్పేశారట. ఆయన వయసుకు తగ్గట్టు ఈ రోల్ ఉంటుందట. డిసెంబర్ నుంచి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారట. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
సంగీత దర్శకుడిగా మూడు సినిమాలు!
నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ... సంగీత దర్శకుడిగా కూడా రఘు కుంచె సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. 'పలాస 1978' సినిమాకు ఆయన స్వరపరిచిన పాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో వినిపిస్తూ ఉంటాయి. ఆ సినిమాతో లోకల్ సింగర్స్‌ను ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సంగీత దర్శకుడిగా ఆయన తొలి సినిమా 'బంపర్ ఆఫర్'లో 'ఎందుకే రావణమ్మా...' పాట ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాస్ మహారాజ రవితేజ 'దేవుడు చేసిన మనుషులు' కూడా మంచి పాటలు అందించారు. త్రిష 'నాయకి' సినిమా పాటలు కూడా హిట్టే.
Also Read : ప్రేక్షకులను తప్ప నేను ఎవరినీ మోసం చేయలేదు : పూరి
రఘు కుంచె యాంకరింగ్ చేసే రోజుల నుంచి ఆయనకు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఫ్రెండ్. నటుడిగా, సంగీత దర్శకుడిగా రఘును పూరి పరిచయం చేశారు. పూరి తీసిన కొన్ని సినిమాల్లో రఘు చిన్న చిన్న రోల్స్ చేశారు.