ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజారాజ్యం పార్టీ కోసం పని చేసిన మాజీ నాయకులు కృషి చేస్తారని జనసేన నేత ఊకా విజయ్ కుమార్ ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు తిరుపతిలో శాంతి స్థాపనతో చరమగీతం పాడుతామని ఆయన చెప్పారు. గతంలో చిరంజీవి స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ప్రజారాజ్యం పార్టీ మాజీ నేతల ఆత్మీయ సమావేశం తిరుపతి సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం (అక్టోబరు 30) జరిగింది. 


చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన నేతలు సమావేశానికి హాజరైయ్యారు. మొదట బలిజ సామాజిక వర్గం నేతలతో సమావేశం నిర్వహించాలని భావించారు. అయితే అందరివాడుగా మన్నలను అందుకున్న చిరంజీవిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం సరి కాదని పీఆర్పీలోని ఇతర కులాల నేతల్ని సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిరక్షణకు చిరంజీవి అభిమానులుగా పోరు సాగించాలని సమావేశం తీర్మానించింది. ఇలాంటి సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందని సమావేశం అభిప్రాయపడింది. 


జనసేన, తెలుగుదేశం పార్టీలతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని సమావేశం పిలుపు ఇచ్చింది. మూడు రాజధానుల వైఎస్ఆర్ సీపీ ప్రతిపాదనను వ్యతిరేకించాలని నిర్ణయించారు. తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి నిర్వహించిన రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శన అనేది పూర్తిగా  బలవంతపు ప్రదర్శన అని ఊకా విజయ్ కుమార్ విమర్శించారు. 


వైఎస్ఆర్ సీపీ అరాచక పాలనకు తెరదించడానికి టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిసి రావాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. చిరంజీవి జనసేనలోకి వస్తే తాము మరింత ఉత్సాహంగా పని చేస్తామని కిరణ్ రాయల్ చెప్పారు.



అప్పట్లో చిరంజీవిని గెలుపులో కీలక పాత్ర


2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసినపుడు బలిజ సామాజికవర్గం మొత్తం ఒక్కటై ఆయనను గెలిపించింది. ఆ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచీ తప్పుకోవడంతో సామాజికవర్గం కూడా విడిపోయింది. ఈ వర్గం ప్రస్తుతం టీడీపీలో ఎక్కువగా కొనసాగుతుంది. కొంత జనసేనలోనూ ఉంది. చాలా తక్కువగా మాత్రం వైఎస్ఆర్ సీపీలో కొనసాగుతోంది. ప్రజారాజ్యం పార్టీలో ఊకా విజయ్ కుమార్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇంఛార్జిగా వ్యవహరించారు. తర్వాత ఆయనతో పాటు కాంగ్రెస్‌లో కొనసాగారు. చిరంజీవి క్రియాశీలక రాజకీయాల నుంచే తప్పుకోవడంతో టీడీపీలో చేరిపోయారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీడీపీని, జనసేన శ్రేణుల్ని ఒక్కటి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు పూర్వ ప్రజారాజ్యం పార్టీ మిత్రుల ఆత్మీయ కలయిక పేరిట సమావేశం ఏర్పాటు చేశారు. 


వైఎస్ఆర్ సీపీలోనే ఉంటూ అసంతృప్తిగా ఉన్న వారినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. తిరుపతి సమావేశం బాగా జరగడంతో ఇదే ఫార్ములాను ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీల్లో అమలు చేయాలని చూస్తున్నారు. 


2008లో ఆవిర్భవించిన పీఆర్పీ


నటుడు చిరంజీవి 26 ఆగష్టు, 2008 ప్రజా రాజ్యం పార్టీని స్థాపించారు. 2009లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ 294 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 18 స్థానాలు గెలుచుకుంది. మొత్తం ఓట్లలో 18 శాతం ఓట్లు ఈ పార్టీకి దక్కాయి. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందారు. తర్వాత ఆగష్టు 2011 లో కాంగ్రెస్ పార్టీలో ప్రజా రాజ్యం పార్టీని విలీనం చేశారు.