Vijay- Sukumar Movie Update: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన నటించి ‘ఫ్యామిలీ స్టార్’ ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో అలరించకపోయినప్పటికీ, వరుస ప్రాజెక్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్నసూరితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాలు చేస్తున్నారు విజయ్. దిల్ రాజు నిర్మాణ సంస్థలో రవి కిరణ్ కోలాతో కలిసి ఓ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు.  మరోవైపు తనతో కలిసి ‘టాక్సీవాలా’ మూవీ చేసిన రాహుల్ సాంకృత్యాన్ తో కలిసి ఓ పిరియాడికల్ డ్రామా చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియన్ చిత్రాలుగానే తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా చేయబోయే మరో మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది.


‘పుష్ప2’ తర్వాత చరణ్ తో సుకుమార్ మూవీ


విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో కొద్ది సంవత్సరాల క్రితం ఓ సినిమాను ప్రకటించారు. ఫాల్కన్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కించేందుకు అప్పట్లో ప్రయత్నించింది. కానీ, కొన్ని కారణాలతో సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఈ సినిమా గురించి మర్చిపోయారు. కొంత మంది మాత్రం ‘పుష్ప 2’ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావించారు. అయితే, విజయ్ దేవరకొండతో మూవీ గురించి ఎలాంటి ప్రకటన చేయకుండానే, రామ్ చరణ్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఇక విజయ్ మూవీకి ఎండ్ కార్డు పడ్డట్లేనని అందరూ భావించారు.


రామ్ చరణ్ మూవీ తర్వాతే విజయ్ మూవీ!


ఈ నేపథ్యంలోనే విజయ్-సుకుమార్ మూవీ సంబంధించి నిర్మాత కేదార్ సెలగంశెట్టి కీలక ప్రకటన చేశారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఫాల్కన్ నిర్మాణ సంస్థ ‘గం గం గణేశా’ అనే సినిమా చేస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత శెలగంశెట్టి విజయ్ మూవీ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో సుకుమార్ బిజీగా ఉన్నారని, రామ్ చరణ్ తో మూవీ కంప్లీట్ చేసిన తర్వాత విజయ్ తో సినిమా చేస్తారని చెప్పారు. ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రౌడీ బాయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.  


ఇంతకీ ఈ సినిమా పట్టాలెక్కేనా?


మరోవైపు ‘పుష్ప’ ప్రాజెక్టు కోసం సుకుమార్ చాలా కాలంగా పని చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా ఎంతకాలం పడుతుందో తెలియదు. ఎటు లేదన్నా ఈ సినిమా 2026 తర్వాతే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం అనే మాట వినిపిస్తోంది. మొత్తంగా ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చే వరకు నమ్మకం లేదని ఇండస్ట్రీలోచర్చ జరుగుతోంది.    


Read Also: 'రాక్షస' నుంచి ఆ స్టార్ హీరో తప్పుకున్నాడా? ‘హనుమాన్‌’ దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయా?