Cyber Crime With Telangana DGP Whatsapp DP: ఫోన్ కాల్స్, ఉద్యోగాలు, లాటరీ వంటి వాటి పేరుతో సైబర్ నేరగాళ్లు ఇప్పటివరకూ మోసాలకు పాల్పడడం చూశాం. తాజాగా, తెలంగాణ డీజీపీ (Telangana DGP) రవిగుప్తా ఫోటోతోనూ కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. పోలీస్ బాస్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు, ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తామని.. కేసు నుంచి తప్పించాలంటే రూ.50 వేలు డిమాండ్ చేశారు. అయితే, దీనిపై అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. విచారించిన పోలీసులు పాకిస్థాన్ కోడ్ +92తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అలాంటి కాల్స్ లిఫ్ట్ చెయ్యొద్దని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీసులు సాంకేతికత ఆధారంగా ఎంత కట్టడి చేస్తున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలకు సంబంధించి 15,297 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
కొత్త తరహా మోసం.. రూ.3.25 లక్షలు స్వాహా
అటు, సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసంతో రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లాలో నలుగురి ఖాతాల్లో నగదు స్వాహా చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోని ఫోన్ నెంబర్లను హ్యాక్ చేసి, వారి పేరిట ఏపీకే లింక్స్ షేర్ చేశారు. తెలిసిన వారే పంపారని ఆ లింక్స్ ఓపెన్ చేయగా.. వారి ఖాతాల్లో నగదు మాయమైంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గంభీరావుపేటకు చెందిన పాల సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి పేరిట సంఘం వాట్సాప్ గ్రూపులో ఏపీకే లింక్ పంపించారు. ఆయన దీన్ని ఓపెన్ చేయగానే అతని ఖాతాలోని రూ.45,500, అలాగే లింక్స్ తెరిచిన దండు నరేశ్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.44,900, లింగారెడ్డిగారి రాజశేఖర్ రెడ్డి అకౌంట్ నుంచి రూ.50 వేలు, కోటయ్యగారి లత ఖాతా నుంచి రూ.1.85 లక్షలు ఇలా 4 రోజుల్లో నలుగురి బ్యాంక్ అకౌంట్స్ నుంచి రూ.3.25 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. ఫోన్లకు వచ్చిన మెసేజ్ చూసి బ్యాంకులను సంప్రదించగా సిబ్బంది నగదు డెబిట్ అయినట్లు తెలిపారు. దీంతో వీరు సోమవారం గంభీరావుపేట ఠాణా పోలీసుల సాయంతో సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశారు. దీనిపై వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
'ఫెడెక్స్ కొరియర్ పేరుతో...'
ఏపీకే లింక్స్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఇలా రకారకాలుగా కాదేదీ మోసం చేయడానికి అనర్హం అంటూ అన్ని మార్గాల్లోనూ సైబర్ కేటుగాళ్లు డబ్బులు దోచేస్తున్నారు. ప్రజల అవగాహన లేమి, కొందరి అత్యాశను వీరు క్యాష్ చేసుకుంటున్నారు. తాజాగా, ఫెడెక్స్ కొరియర్ పేరుతోనూ సైబర్ నేరస్థులు మోసాలకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. కేటుగాళ్లు FedEx కొరియర్ పేరుతో కాల్ చేస్తారు. మీ ఆధార్ నెంబర్ తో పార్శిల్ వచ్చిందని అందులో డ్రగ్స్ పట్టుబడ్డాయని ఆందోళనకు గురి చేస్తారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడితే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తారు.
'అప్రమత్తంగా ఉండాలి'
అయితే, ఇలాంటి వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని.. ధైర్యంగా ఎదుర్కోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 'FedEx పార్శిల్స్ పేరుతో మోసపూరిత కాల్స్ నమ్మొద్దు. పోలీసులమని చెబితే డబ్బులు ఇవ్వొద్దు. ఏమైనా సందేహాలుంటే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. మనం తప్పు చేయనంత కాలం ఆందోళన చెందాల్సిన పని లేదు. అలాంటి కాల్స్ వస్తే భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి.' అని సూచించారు.