లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. చాలా మంది ప్రేక్షకులు ఓటీటీల్లో సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేశారు. సమంత, కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఓటీటీ ప్రాజెక్ట్స్ లో నటించారు. నటి ప్రియమణి కూడా 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలిసారి ఆమె తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా' కోసం ఓ సినిమాలో నటిస్తోంది.
దీనికి 'భామాకలాపం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అభిమన్యు తడిమేటి అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా టీజర్ ను విడుదల చేశారు.
ఇరుగుపొరుగు వారి ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే ఓ గృహిణి కథే ఈ సినిమా. 'మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించొచ్చు.. కానీ పక్కవాళ్ల గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు' అంటూ ప్రియమణి చెప్పే డైలాగ్ తో సినిమాలో ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్ధమవుతుంది. ఒక హౌస్ వైఫ్, మర్డర్ కేసు చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని టీజర్ బట్టి తెలుస్తోంది. టీజర్ ని అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఫిబ్రవరి 11న 'ఆహా'లో ఈ సినిమా ప్రసారం కానుంది.