ఇంతవరకు లావుగా ఉన్న పెద్దలకే త్వరగా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలుసు. ఇప్పుడు ఊబకాయం ఉన్న పిల్లల్లో కూడా గుండె పై తీవ్ర ప్రభావం పడనున్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. ఈ అధ్యయనంలో గుండెలోని నాలుగు గదుల్లో ఒకటై ఎడమ జఠరికను పరిశీలించారు శాస్త్రవేత్తలు. అది సాధారణంగా లేకుండా కాస్త ఒంపు తిరిగిందని కనిపెట్టారు. ఈ లక్షణం ఇంతవరకు కేవలం ‘ఆర్టిక్ స్టెనోసిస్’ అనే గుండె సమస్య ఉన్న రోగుల్లో మాత్రమే కనిపించింది. ఇప్పుడు ఊబకాయం ఉన్న పిల్లల్లో బయటపడడం వైద్యులను సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ అధ్యయనం కోసం నెదర్లాండ్స్ లోని 2632 మంది పిల్లల గుండె ఆకారాలను పరిశీలించారు. వీరంతా పదేళ్ల వయసు వారే. వీరిలో సగం అమ్మాయిలు, సగం మంది అబ్బాయిలు. ఊబకాయులైన వీరందరిలో కామన్‌గా గుండె అనాటమీపై ప్రభావం పడినట్టు గుర్తించారు. ప్రపంచఆరోగ్యసంస్థ చెప్పిన ప్రకారం యూరోప్ దేశాల్లోని ప్రజల్లో 60 శాతం మంది పెద్దలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇక 11 వయస్సు గల వారిలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఊబకాయులే. గుండె అధ్యయనకర్త, ప్రొఫెసర్ పాబ్లో లమాటా మాట్లాడుతూ ‘భవిష్యత్తులో ఎలాంటి గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేయాలి’ అని చెప్పారు.
మరొక పరిశోధకులు మాసీజ్ మార్సినియోక్ మాట్లాడుతూ ‘పిల్లల్లో ఊబకాయం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం. వారిలో ఆరోగ్యకరమైన ఎదుగుదలను ఇది అడ్డుకుంటుంది. పిల్లలు బరువు పెరుగుతుంటే ఎందుకు పెరుగుతున్నారో తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులదే’ అని చెప్పారు.
పిల్లలు కాస్త బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటూ మురిసిపోతారు చాలా మంది తల్లిదండ్రులు. కానీ బొద్దుతనం వారి ఆరోగ్యానికి చాలా ప్రమాదమని అర్థం చేసుకోవాలి. చిన్నప్పట్నించి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తే కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. రోజూ కనీసం గంటపాటూ వారు వ్యాయామం చేసేలా చూడాలి. వారి వయసులో వ్యాయామం అంటే ఆటలే. పరుగెడుతూ, గెంతుతూ ఆడుకుంటే చాలు. బరువు వారే తగ్గుతారు.
Also read: మీలో ఎంతమందికి తెలుసు నేతాజీ ఒక ఐఏఎస్ ఉద్యోగి అని? ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలేసిన మహానేత
Also read: ప్లేటులో బాతు మెడ వంటకం... ఎలా తినాలంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు, లండన్ రెస్టారెంట్ చెత్త ప్రయోగం