Premalu Movie Collections: మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం ‘ప్రేమలు‘. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ మలయాళంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కేరళలో మంచి ప్రజాదరణ పొందిన ఈ సినిమా మార్చి 8న తెలుగులోనూ విడుదల అయ్యింది. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ‘ప్రేమలు‘ సినిమాకు తెలుగులోనూ మంచి స్పందన లభిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
తెలుగులో ‘ప్రేమలు‘ సరికొత్త రికార్డు
బాక్సాఫీస్ దగ్గర ‘ప్రేమలు‘ తెలుగు వెర్షన్ దుమ్మురేపుతోంది. డీసెంట్ వసూళ్లతో సత్తా చాటుతోంది. రోజుకు రూ. 1 కోటికి పైనే కలెక్షన్ సాధిస్తోంది. మొత్తంగా, సినిమా విడుదలైన 10 రోజుల్లో ఈ మలయాళీ డబ్బింగ్ చిత్రం రూ. 10.54 కోట్లు రాబట్టింది. తెలుగులో ఓ మలయాళీ డబ్బింగ్ చిత్రం ఇంత మొత్తంలో రాబట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. దర్శక దిగ్గజం రాజమౌళి, అనిల్ రావిపూడి లాంటి వాళ్లు ఈ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు మహేష్ బాబు లాంటి హీరోలు ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘ప్రేమలు‘ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
మలయాళంలో రూ.100 కోట్లు వసూలు
గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ‘ప్రేమలు’ సినిమాలో నెస్లేన్ గఫూర్, మిమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించారు. శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రల్లో కనిపించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో ఈ సినిమా విడుదల కాగా, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.110 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు విష్ణు విజయ్ సంగీతం అందించారు. శ్యామ్ పుష్కరన్, దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఓటీటీలోకి ‘ప్రేమలు‘ వచ్చేది ఎప్పుడంటే?
అటు ‘ప్రేమలు‘ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నా, ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్ బయటికొచ్చింది.‘ప్రేమలు’ను థియేటర్లలో మిస్ అయినవారు మాత్రమే కాదు.. థియేటర్లకు వెళ్లి చూసినవారు కూడా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘ప్రేమలు’ మూవీ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా ప్రకటించారు. కానీ, ఓటీటీ రిలీజ్ డేట్‌పై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం మార్చి 29 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్రారంభించుకుంటుందని తెలుస్తోంది.
Read Also: 'టిల్లు స్క్వేర్' రీ రికార్డింగ్ - బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ చేతిలో సినిమా