భారతీయ బాక్సాఫీస్ 'బాహుబలి' ప్రభాస్ (Prabhas)! ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయకుడు ఎవరని ఆరా తీస్తే ముందు వరుసలో వినిపించే పేరు ప్రభాస్! ఇటు యువతలో, అటు కుటుంబ ప్రేక్షకుల్లో అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరు ప్రభాస్! అన్నిటి కంటే ముఖ్యంగా చిత్రసీమలో అందరి మిత్రుడు, అజాత శత్రువు ప్రభాస్! స్టార్స్, ఫ్యాన్స్, పబ్లిక్... అందరి డార్లింగ్ ప్రభాస్!


ప్రస్తుత తెలుగు సినిమాను జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత 'బాహుబలి'కి దక్కుతుంది. అందులో ప్రభాస్ కృషి, కష్టం ఉన్నాయి. అయితే, 'బాహుబలి' తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం దక్కలేదు. 'బాహుబలి 2' తర్వాత వచ్చిన 'సాహో' మిక్స్డ్ టాక్‌తో వందల కోట్ల వసూళ్లు సాధించింది. అది ప్రభాస్ స్టార్‌డమ్‌కు నిదర్శనం. ముఖ్యంగా ఉత్తరాదిలో వచ్చిన వసూళ్లు, నార్త్ ఇండియాలో ఆయనకు ఎంత క్రేజ్ ఉందనేది చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. 'సాహో' తర్వాత వచ్చిన 'రాధే శ్యామ్' డిజాస్టర్ అయ్యింది. అది వేరే విషయం అనుకోండి.


రెండు ఫ్లాప్స్ వల్ల ప్రభాస్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆయన చేతిలో భారీ పాన్ ఇండియా సినిమాలు నాలుగైదు ఉన్నాయి. ఒక్కటి హిట్ అయినా చాలు... మరో ఐదు సినిమాలు వస్తాయి. ఇప్పటికిప్పుడు ఆయన క్రేజ్‌కు వచ్చిన నష్టం ఏమీ లేదు. అయితే, ఇదే విధంగా సినిమాలు చేస్తూ పోతే భవిష్యత్తులో తమ హీరో క్రేజ్ తగ్గుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 


మొహమాటానికి, ఇచ్చిన మాట కోసం 
ప్రభాస్ సినిమాలు చేస్తూ పోతే ఎలా?
'బాహుబలి 2' వంటి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎవరైనా మినిమంలో మినిమం సేఫ్ గేమ్ ఆడతారు. పేరున్న దర్శకుడితో సినిమా చేస్తారు. ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసే నిర్మాణ సంస్థలకు సినిమా చేసి క్యాష్ చేసుకోవాలని చూస్తారు. ప్రభాస్ మాత్రం అలా చేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' తీసిన సుజీత్‌కు 'సాహో' చేసే అవకాశం ఇచ్చారు. కజిన్ ప్రమోద్, స్నేహితుడు వంశీ స్థాపించిన యువి క్రియేషన్స్ సంస్థలో ఆ సినిమా చేశారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా ఏవరేజ్ సినిమా తీసిన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' చేశారు. ఆ సినిమా నిర్మాతలలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కుమార్తె ప్రసీధ ఒకరు. యువి క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్ అంటే ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్స్ అనుకోవాలి. 


మాటకు కట్టుబడి 'సాహో', 'రాధే శ్యామ్' సినిమాలు చేశారు ప్రభాస్. అటువంటి మొహమాటాలు వదిలేయాలని అభిమానులు కోరిక. నిజం చెప్పాలంటే... ప్రభాస్ 'ఊ' అంటే అతడితో సినిమా చేయడానికి సిద్ధార్థ్ ఆనంద్ (హిందీ హిట్ 'వార్' ఫేమ్) బాలీవుడ్ దర్శకులు, కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ సినిమా వంటి తెలుగు నిర్మాణ సంస్థలు, హిందీలో పలు కార్పొరేట్ కంపెనీలు రెడీగా ఉన్నాయి. అటువంటి తరుణంలో మారుతి దర్శకత్వంలో సినిమా అంగీకరించి అందరికీ షాక్ ఇచ్చారు ప్రభాస్!


తెలుగులో మారుతి మంచి సినిమాలు తీశారు. అయితే, ఇప్పటి వరకు టాలీవుడ్ న్యూ జనరేషన్ స్టార్ హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. వెంకటేష్, నాగ చైతన్యతో ఆయన తీసిన సినిమాలు ఆశించిన విజయాలు అందుకోలేదు. సో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను ఆయన హ్యాండిల్ చేయగలడా? అని కొందరు అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మారుతితో సినిమా వద్దని సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటే... వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 'పక్కా కమర్షియల్' బాక్సాఫీస్ పరంగా ఫ్లాప్ అయినా, అభిమానులు వద్దంటున్నా ప్రభాస్ నిర్మాణంలో మార్పు రాలేదు. పోనీ, ఆయనకు సినిమాలు లేవా? బోలెడు ఉన్నాయి. 


దర్శకుల ఎంపికలో ప్రభాస్ జాగ్రత్తలు వహించాలని, తన ఇమేజ్, స్టార్‌డమ్‌ & ఫ్యాన్ ఫాలోయింగ్ అర్థం చేసుకుని హ్యాండిల్ చేసేవాళ్ళతో సినిమాలు చేయాలని, మిగతా వాళ్ళకు 'నో' చెప్పడం నేర్చుకోవాలని అభిమానులు కోరుతున్నారు. కథల ఎంపికలోనూ యూనివర్సల్ అప్పీల్ ఉన్నవి చూసుకోవాలని ఆశిస్తున్నారు. 


'రాధే శ్యామ్' డిజాస్టర్ కావడంతో వచ్చిన నష్టాలు భర్తీ చేయడం కోసం, త్వరగా చిత్రీకరణ పూర్తి చేసే మారుతితో ప్రభాస్ సినిమా అంగీకరించారనేది టాలీవుడ్ గుసగుస. అదీ ఫ్లాప్ అయితే అనేది అభిమానుల ప్రశ్న! 'సాహో', 'రాధే శ్యామ్' ఫ్లాప్స్ తర్వాత కూడా వాటికి రెండు రేట్లు ఎక్కువ ఖర్చుపెట్టి అయినా సరే సినిమా తీయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఈ తరుణంలో మారుతితో సినిమా చేయకూడదని, ఆ మార్కెట్ డ్యామేజ్ కాకూడదనేది అభిమానుల కోరిక. 


Also Read : కాషాయ జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా? అందులో ప్రభాస్ సినిమాయే ఫస్ట్


'ఆదిపురుష్' టీజర్ ప్రభాస్ వీరాభిమానుల్లో చాలా మందికి నచ్చలేదు. సినిమాను త్రీడీలో చూస్తే బావుంటుందని స్వయంగా ప్రభాస్ చెప్పినా కన్వీన్స్ కావడం లేదు. ఆ సినిమా నిర్మాతలు కూడా ప్రభాస్ ఇమేజ్ మీద నమ్మకం పెట్టుకున్నారు. భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.   


అభిమానుల ఆశలు వేరు!
ఇప్పుడు ప్రభాస్ షూటింగ్ చేస్తున్న సినిమాల్లో... 'కెజిఎఫ్', 'కెజిఎఫ్ 2' వంటి పాన్ ఇండియా విజయాలు అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' ఒకటి. నాగ్ అశ్విన్ తీస్తున్న 'ప్రాజెక్ట్ కె' మరొకటి. అటువంటి సినిమాలు చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. 


అభిమానులు అనుకుంటున్నారు కానీ... తనలో సహజ గుణాన్ని, మంచితనాన్ని ప్రభాస్ ఎలా వదులుకుంటారు? వదులుకోవాలనుకున్నా సాధ్యమా? ఎవరూ కావాలని ఫ్లాప్ సినిమా తీయరు కదా! అందుకని, ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ భారీ విజయాలు సాధించాలని... హ్యాపీ బర్త్ డే ప్రభాస్.