Janasena Leaders : విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో అరెస్టైన తొమ్మిది మంది జనసేన నాయకులు శనివారం సాయంత్రం విడుదలయ్యారు. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో కండీషన్ బెయిల్ కోసం హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో విశాఖ సెంట్రల్ జైలు నుంచి తొమ్మిది మంది జనసేన నేతలు విడుదలయ్యారు. సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన తొమ్మిది మంది నేతలు ప్రతిరోజు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముందు హాజరుకావాలని జనసేన లీగల్ సెల్ న్యాయవాదులు రేవతి, కళావతిలు తెలిపారు. సెంట్రల్ జైల్లో వేధింపులకు గురిచేస్తున్నారనడంలో వాస్తవంలేదన్నారు. హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశామని, అందుకు హై కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఈ సందర్భంగా  హైకోర్టుకు అభినందనలు తెలియజేశారు. 


పలువురు అరెస్ట్ 


విశాఖ సెంట్రల్ జైల్ వద్ద జనసేన నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్, ఆరేటి మహేష్ లు పోలీసులు అరెస్టు చేసి ఆరిలోవ పీఎస్ కు తరలించారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.  సెక్షన్ 30 అమలులో ఉన్న కారణంగా వారిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 






 అన్ని అనుమతులు తీసుకున్నాం : జనసేన నేతలు


పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనకు అన్ని  అనుమతులు తీసుకున్నామన్నారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ.  ఎయిర్ పోర్టులో రోజా కన్వాయ్ పై దాడి చేశామని కేసులు పెట్టారని, ఆవిడ వేలు చూపెట్టి కుర్రాళ్లను రెచ్చగొట్టి జనసేన నేతలను ఇబ్బంది పెట్టారన్నారు. జనసేన అధికార ప్రతినిధి శివ శంకర్ మాట్లాడుతూ రాజకీయ ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో తమ అధినాయకుడు జనసేన పార్టీ పెట్టారన్నారు. సిద్ధాంత భావజాలంతో ఏర్పాటు చేశారన్నారు. విశాఖ పర్యటనలో ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి 3 రోజులు పర్యటనకు అన్ని అనుమతులు తీసుకుని వచ్చినప్పటికీ అధికార పార్టీ ఆయనపై కక్ష్య పూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వచ్చే సమయానికి తాము ఎయిర్ పోర్టు వీఐపీ లాంజ్ లో ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని ప్రజల గురించి మాట్లాడితే వారిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసి పిరికి పంద చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. ఏపీలో  పులివెందుల రాజ్యాంగం నడుస్తుందని భారత రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవా చేశారు.


అసలేం జరిగింది?


విశాఖ జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు పవన్ కల్యాణ్ 15వ తేదీ సాయంత్రం నగరానికి వచ్చారు. పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. అయితే అదే రోజు మూడు రాజధానుల కోసం నిర్వహించిన విశాఖ గర్జనలో వైసీపీ నేతలు, మంత్రులు పాల్గొన్నారు. గర్జన ర్యాలీ అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణంలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రులపై కొందరు దాడికి పాల్పడ్డారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మంత్రులపై దాడి చేసిన ఘటనలో 92 మందిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల విశాఖలోని ఏడో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు 71 మందిని పోలీసులు హాజరు పర్చారు. వీరిలో 62 మందికి 10 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఏ - 1, ఏ - 9 నిందితులపై ఉన్న హత్యాయత్నం సెక్షన్‌ను తీవ్రగాయం కేసుగా మార్చారు. అంటే సెక్షన్ 307 ను తొలగించి సెక్షన్ 326 గా మార్చారు. వీరికి మాత్రం కోర్టు రిమాండ్ విధించారు. మొత్తం తొమ్మిది మంది జనసేన నాయకులకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది కోర్టు. జనసేన నేతలు కోన తాతారావు, సుందరపు విజయ్ కుమార్, మూర్తి యాదవ్, సందీప్, శ్రీనివాస పట్నాయక్, కృష్ణ, రూప, శ్రీను సెంట్రల్ జైల్ లో ఉన్నారు. వీరంతా బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు 9 మంది జనసేన నేతలకు బెయిల్ మంజూరు చేసింది.